హీరో డ‌బ్బింగ్ వీడియో చూశారా?


మ‌హేష్ బావ‌.. కృష్ణ అల్లుడు అనే గుర్తింపుతో హీరోగా అరంగేట్రం చేసి కెరీర్ ఆరంభంలో వ‌రుస ఫ్లాపులు, అలాగే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు సుధీర్ బాబు. యాక్టింగ్, లుక్స్, వాయిస్ విష‌యంలో అత‌డి మీద చాలా కౌంట‌ర్లే ప‌డ్డాయి. ఐతే క‌ష్ట‌ప‌డి ఆ లోపాల‌న్నీ దిద్దుకుని జ‌నాల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడ‌త‌ను. కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, స‌మ్మోహ‌నం, న‌న్ను దోచుకుందువ‌టే సినిమాలు సుధీర్ బాబు మీద ప్రేక్ష‌కుల్లో సానుకూల అభిప్రాయం తీసుకొచ్చాయి.

పాత్ర‌ల కోసం అత‌డి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న సిన్సియారిటీని జ‌నాలు గుర్తించారు. ఇప్పుడు సుధీర్ చేస్తున్న శ్రీదేవి సోడా సెంట‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో మొద‌టి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం. ప‌లాస 1978 ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ రూపొందించిన చిత్ర‌మిది.

శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాకు సుధీర్ బాబు ఇప్ప‌టికే డ‌బ్బింగ్ కూడా చెప్పేశాడు. కొన్ని రోజుల కింద‌టే డబ్బింగ్ మొద‌లుపెడుతున్న‌ట్లు అప్ డేట్ ఇచ్చిన సుధీర్.. తాజాగా ఆ ప‌ని పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డిస్తూ, తాను సినిమాలో ఓ కీల‌క దృశ్యానికి డ‌బ్బింగ్ చెబుతున్న వీడియోను పంచుకున్నాడు.

అది ఓ యాక్ష‌న్ సీన్ కాగా.. ఎదురుగా దృశ్యాన్ని చూస్తూ అందుకు త‌గ్గ‌ట్లుగా డ‌బ్బింగ్ చెబుతున్న దృశ్యం క‌నిపించింది. అవ‌తలి వ్య‌క్తిని కొడుతున్న‌పుడు.. త‌న చేతిలో దెబ్బ‌లు తింటున్న‌పుడు ఒరిజిన‌ల్‌గా వాయిస్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ అలాగే సుధీర్ డ‌బ్బింగ్ చెప్ప‌డం క‌నిపించింది. డ‌బ్బింగ్ చెప్పేట‌పుడు అంద‌రూ ఇంత‌గా ఫీల్ అయి చెబుతార‌ని అనుకోలేం. ఇది సుధీర్ క‌మిట్మెంట్‌ను చాటిచెప్పేదే. తమిళంలో మంచి పేరు సంపాదించిన తెలుగ‌మ్మాయి ఆనంది క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్నందిస్తున్నాడు. 70 ఎంఎం ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్ మీద విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.