విషమంగా కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి

అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు.. బిగ్ బాస్ ఫేం కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. తొలుత స్వల్ప గాయాలు తగిలినట్లుగా వార్తలు వచ్చినప్పటికి అందులో నిజం లేదని చెబుతున్నారు. కోల్ కతా నేషనల్ హైవే మార్గంలో నెల్లూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున (శనివారం) చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం లో ఆయన తలకు బలమైన గాయం తగిలినట్లుగా వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ మీద చికిత్స చేస్తున్న వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు.. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

తొలుత స్వల్ప గాయాలుగా పేర్కొనటంతో ఊపిరి పీల్చుకున్న ఆయన కుటుంబ సభ్యులు.. అభిమానులు గంటలు గడిచే కొద్దీ వస్తున్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరికొద్ది గంటల్లో కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేస్తారని చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మెడికవర్ ఆసుపత్రికి ఆయన బంధువులు.. స్నేహితులు చేరుకున్నారు. ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య సాయాన్ని అందిస్తున్నట్లుగా ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.