కన్నడ రీమేక్ లో ప్రియమణి!

గతేడాది కన్నడలో విడుదలైన ‘యాక్ట్ 1978’ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుని ఎండగట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన డబ్బు కోసం రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన ఓ గర్భిణీ స్త్రీ తన కడుపుకి బాంబ్ చుట్టుకొని గవర్నమెంట్ ఆఫీసును లాక్ చేస్తుంది. దీంతో స్టేట్ మొత్తం ఇదొక హాట్ న్యూస్ అవుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది సినిమా.

దర్శకుడు మన్సోరే డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. కన్నడలో నటి యజ్ఞశెట్టి లీడ్ రోల్ లో కనిపించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా నటి ప్రియమణిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ప్రియమణి పెళ్లి చేసుకొని కొంతకాలంపాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మళ్లీ పలు వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా గడుపుతుంది. ఇలాంటి సమయంలో ఆమెకి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఛాన్స్ రావడం విశేషమనే చెప్పాలి. మరి ప్రియమణి ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం హెస్తుందో చూడాలి!