ఓవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ అధికార వైకాపా సర్కారు మీద పోరాడుతుంటే.. మరోవైపు ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి జగన్ పట్ల పూర్తి సానుకూలతతో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జగన్‌ను పొగడ్డానికి ఏ చిన్న అవకాశం వచ్చినా చిరు వదిలిపెట్టట్లేదు. వివిధ సందర్భాల్లో జగన్ మీద ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు వేశాడు చిరు. తాజాగా ఏపీలో ఒకే రోజు 13 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేయడంపై జగన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ వేశారాయన.
త్వరలోనే చిరు జగన్‌ను కలవబోతుండటం విశేషం. ఇందుకోసం ఆయన అమరావతికి వెళ్లబోతున్నారు. చిరు ఇలా అమరావతికి వెళ్లి ఏపీ సీఎంను కలవనుండటం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకు ఒకసారి వ్యక్తిగతంగా వెళ్లి జగన్‌ను ఇంట్లో కలిసిన చిరు.. ఆ తర్వాత గత ఏడాది కరోనా బ్రేక్ అనంతరం నాగార్జున తదితరులతో వెళ్లి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జగన్‌తో మాట్లాడాడు మెగాస్టార్.
ఇప్పుడు మరోసారి చిరు.. సినీ ప్రతినిధుల బృందంతో కలిసి జగన్‌ను కలిసేందుకు వెళ్లనున్నారట. ఇంకో రెండు వారాల తర్వాత ఈ మీటింగ్ ఉంటుందని సమాచారం. ఈసారి ప్రధానంగా ఏపీలో థియేటర్లకు సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడబోతున్నట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’ రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకురావడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా పాత రేట్లతో టికెట్లు అమ్మితే నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడటం ఖాయమని.. అలాగే ఏరియాల వారీగా టికెట్ల రేట్లలో స్లాబులు పెడితే కష్టమని.. అన్ని చోట్లా ఒకే రకమైన ధరలు ఉండేలా చూడాలని జగన్‌కు విన్నవించనుందట చిరు బృందం.
దీంతో పాటుగా సినీ పరిశ్రమకు అవసరమైన సాయాల గురించి కూడా చిరు టీం ఏపీ సీఎంతో మాట్లాడనుందట. జగన్ నుంచి హామీ వస్తే తప్ప మళ్లీ థియేటర్లను నడిపించడం సాధ్యం కాదని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ చాలా కీలకమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates