తెలుగమ్మాయిలు చాలామందే తమిళ సినీ పరిశ్రమలో కథానాయికలుగా మంచి పేరు సంపాదించి.. అక్కడ సెటిలయ్యారు. ఐతే గత కొన్నేళ్లలో అచ్చమైన తమిళ అమ్మాయిలు తెలుగులోకి వచ్చి ఇక్కడ అవకాశాలు అందుకోవడం బాగా తగ్గిపోయింది. ఐతే హీరోయిన్ల సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఓ తమిళ అమ్మాయి క్యారెక్టర్, విలన్ పాత్రలతో తెలుగులో బిజీ అయిపోతుండటం విశేషం. ఆ నటి పేరు.. వరలక్ష్మి శరత్ కుమార్.
గ్యాంగ్ లీడర్, బన్నీ, జయజానకి నాయక సహా తెలుగులో కొన్ని డైరెక్ట్ సినిమాలు చేసిన సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. ఐతే ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా ప్రయోజనం ఏమీ కలగలేదు. కానీ ‘క్రాక్’ సినిమాతో వరలక్ష్మి దశ తిరిగిపోయింది. అందులో జయమ్మ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘నాంది’లో చేసిన పాత్ర కూడా వరలక్ష్మికి మంచి పేరే తెచ్చింది.
ఈ ఊపులో వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది వరలక్ష్మి. ఇప్పటికే ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో చేస్తున్న చేయబోతున్న సినిమాలో వరలక్ష్మికి ఒక కీలక పాత్ర దక్కింది. బాలయ్యతో సినిమా అంటే వరలక్ష్మి టాలీవుడ్ కెరీర్ మరో స్థాయికి చేరినట్లే.
ఇప్పుడేమో ఆమె మరో మంచి ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. జాంబిరెడ్డితో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ.. కొత్తగా ‘హనుమాన్’ పేరుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘జాంబి రెడ్డి’ ఫేమ్ తేజ సజ్జానే హీరో. ఈ చిత్రంలో కీలకమైన లేడీ క్యారెక్టర్లో వరలక్ష్మి నటించనుందట. ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. తేజ పక్కన ఆమె కథానాయికగా కూడా సెట్టవ్వదు. హీరోయిన్ని మించి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లో ఆమె కనిపించనుందట. ఓవైపు తమిళంలో క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తూనే.. ఇంకోవైపు తెలుగులోనూ మంచి మంచి అవకాశాలతో వరలక్ష్మి కొన్నేళ్ల పాటు ఖాళీ లేకుండా డైరీని నింపేస్తుండటం విశేషం.