కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో థియేటర్లు మూతపడి ఉన్నాయి. తెరుచుకున్న కొన్ని చోట్ల కూడా నామమాత్రంగానే నడుస్తున్నాయి. కానీ థియేటర్లు నడిచే రోజుల్లో మాదిరే ఈ శుక్రవారం కొత్త సినిమాల సందడి నెలకొంది. ఓటీటీల ద్వారా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ రోజు. వాటి చుట్టూ చాలా హైపే కనిపించింది.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు కొన్ని రోజులుగా. అందులో ఒకటి ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన తమిళ చిత్రం జగమే తంత్రం కాగా.. ఇంకోటి విద్యాబాలన్ పాత్రలో అమిత్ మసూర్కర్ రూపొందించిన హిందీ సినిమా షేర్ని. జగమే తంత్రం నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కాగా.. షేర్నిని అమేజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఐతే ఈ రెండు చిత్రాలకు భిన్నమైన స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి.
అసురన్, కర్ణన్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ధనుష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో జగమే తంత్రంపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసి దిమ్మదిరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దిబ్బ టైపు సినిమా ఇది. పేరుకు ఇంటర్నేషనల్ సినిమా కానీ.. హడావుడి తప్ప ఏమీ లేదు. రజినీ నటించిన కబాలి టైపులో చాలా నీరసంగా సాగిందీ సినిమా. ఇంకా చెప్పాలంటే రజినీ చిత్రమే నయం. ధనుష్, కార్తీక్ తమపై పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చూశారు. సినిమా చూసిన వాళ్లంతా వాళ్లిద్దరికీ ఓ దండం అనేస్తున్నారు.
ఐతే షేర్ని చూసిన వాళ్లు మాత్రం విద్యాబాలన్‌కు, ఆ చిత్ర బృందానికి సెల్యూట్ కొడుతున్నారు. మనుషుల్ని వేటాడే ఓ సింహాన్ని పట్టుకునే క్రమంలో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ చేసే సాహసమే ఈ సినిమా. ఈ కాలానికి చాలా అవసరమైన సినిమాగా దీన్ని చెబుతున్నారు. వినోదాన్నందిస్తూనే ఆలోచన రేకెత్తించేలా వాస్తవికంగా సాగిన ఈ చిత్రానికి అన్ని వైపులా ప్రశంసలు దక్కుతున్నాయి. విద్యా నటన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.