న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసిన హీరోయిన్


నువ్వు నేను సినిమాతో యువ తెలుగు హృద‌యాల‌ను క‌ట్టి పడేసిన ముంబ‌యి భామ అనిత‌. ఆ సినిమాతో ఒక్క‌సారిగా బిజీ అయిపోయిన ఈ భామ‌.. శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్ట‌ప‌డ్డాను, ఆడంతే అదో టైపు లాంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ కూడా ఆశించిన ఫ‌లితాలివ్వ‌క‌పోవ‌డంతో చాలా త్వ‌ర‌గా ఫేడ‌వుట్ అయిపోయిందీ భామ‌. అలాగ‌ని ఆమె ఖాళీ అయిపోలేదు. మ‌ళ్లీ ముంబ‌యికి వెళ్లిపోయింది. అక్క‌డ కొన్ని సినిమాలు చేసింది.

అలాగే త‌న‌కు బాగా క‌లిసొచ్చిన టీవీ రంగంలోకి పున‌రాగ‌మ‌నం చేసి బిజీ అయ్యింది. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో తీరిక లేకుండా ఉన్న అనిత‌.. 2013లో రోహిత్ రెడ్డి అనే కార్పొరేట్ ప్రొఫెష‌న‌ల్‌ను పెళ్లాడాక కూడా న‌ట‌న‌కు దూరం కాలేదు. గ‌త ఏడాది వర‌కు ఆమె టీవీ రంగంలో బిజీగానే ఉంది.

ముఖ్యంగా నాగిన్ సిరీస్‌తో అనిత ఉత్త‌రాదిన బాగా ఫేమ‌స్. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే 5 పార్ట్స్ రావ‌డం విశేషం. చివ‌ర‌గా వ‌చ్చిన నాగిన్-5లోనూ అనిత న‌టించింది. ఐతే టీవీ రంగంలో తీరిక లేకుండా ఉన్న ఆమె.. ఉన్న‌ట్లుండి న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుక్కార‌ణం త‌న‌కు కొడుకు పుట్ట‌డ‌మే. ఫిబ్ర‌వ‌రిలో మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అనిత‌.. కొన్ని నెల‌ల త‌ర్వాత న‌ట‌న‌లోకి పున‌రాగ‌మ‌నం చేస్తుంద‌నుకున్నారు. కానీ తాను ఇక త‌న స‌మ‌యాన్ని త‌న బిడ్డ‌కే కేటాయించాల‌నుకున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించింది. భ‌విష్య‌త్తులో న‌ట‌న‌లోకి తిరిగొస్తానో లేదో కూడా చెప్ప‌లేని ఆమె పేర్కొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మా బాబు సంరక్షణ చూసుకోవడం నాకెంతో అవసరం. అందుకే ఇకపై సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతానా లేదా అని ఇప్పుడు ఆలోచించ‌ట్లేదు. మ‌ళ్లీ రావాల‌నుకుంటే మాత్రం చెబుతాను అని అనిత పేర్కొంది.