స‌ల్మాన్ సినిమాకు ప‌రాభ‌వం

గ‌త నెల‌లోనే రంజాన్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ సినిమా రాధె. అస‌లు కొత్త సినిమాల రిలీజే లేని టైంలో స‌ల్మాన్ ఖాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అనేస‌రికి జ‌నాలు తొలి రోజు బాగానే ఎగ‌బ‌డ్డారు. ఏకంగా టికెట్ రేటు రూ.249 పెట్ట‌డంతో బాగానే సొమ్ము చేసుకున్నారు. కానీ ఆ డ‌బ్బులకు ఏమాత్రం న్యాయం చేసేలా ఆ సినిమా లేక‌పోయింది.

సామాన్య ప్రేక్ష‌కుల సంగ‌త‌లా ఉంచితే.. స‌ల్మాన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా చూసి తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఇంత రొడ్డ‌కొట్టుడు సినిమా తీశాడేంటి అని ప్ర‌భుదేవాను తిట్టుకున్నారు. ఈ చిత్రానికి ఐఎండీబీలో బ్యాడ్ రేటింగ్ వ‌చ్చింది. స‌ల్మాన్ కెరీర్లోనే అతి త‌క్కువ రేటింగ్ వ‌చ్చింది ఈ చిత్రానికే. ఐతే జీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌పుడే.. థియేట‌ర్లు తెరుచుకున్నాక పెద్ద తెరలోనూ ఈ సినిమా రిలీజ‌వుతుంద‌ని మేక‌ర్స్ అప్పుడే ప్ర‌క‌టించారు.

ఇటీవలే మ‌హారాష్ట్ర‌లో లాక్ డౌన్ షర‌తులు తొల‌గిపోయి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు పునఃప్రారంభం కావ‌డం తెలిసిందే. కానీ అవి నామ‌మాత్రంగా న‌డుస్తున్నాయి. జ‌నాలు థియేట‌ర్ల‌కు ఇప్పుడే వ‌చ్చే ప‌రిస్థితి లేదు. న‌డిపించ‌డానికి చెప్పుకోద‌గ్గ సినిమాలు కూడా లేవు. ఐతే ముంబ‌యిలోని రెండు థియేట‌ర్ల‌లో రాధె సినిమాను రిలీజ్ చేసి చూశారు దాని య‌జ‌మానులు. ఎంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయిన‌ప్ప‌టికీ.. స‌ల్మాన్ హీరోగా చేసిన భారీ చిత్రం కావ‌డంతో ఈ సూప‌ర్ స్టార్‌ను చూడ‌టానికైనా అభిమానులు ఓ మోస్త‌రుగా వ‌స్తార‌ని అంచ‌నా వేశారు.

కానీ తొలి రోజు మొత్తంలో ఈ సినిమాకు కేవ‌లం 84 టికెట్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి. వాటి ద్వారా రూ.6 వేల పైచిలుకు ఆదాయం మాత్ర‌మే వ‌చ్చింది. ప‌రిస్థితులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ ఇంత త‌క్కువ వ‌సూళ్లు రావ‌డ‌మంటే ఇది స‌ల్మాన్ సినిమాకు ప‌రాభ‌వమే అని ట్రేడ్ పండిట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.