నిధి అగర్వాలా మజాకా

టాలీవుడ్ స్టార్లకు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ రావడానికి వాళ్ల సినిమాలు హిందీలో అనువాదమై యూట్యూబ్‌లో రిలీజ్ కావడమే కారణం. జియో పుణ్యమా అని తక్కువ ధరకు ఎక్కువ డేటా అందుబాటులోకి రావడంతో మారు మూల గ్రామాల వాళ్లు సైతం యూట్యూబ్‌లో బోలెడన్ని సినిమాలు చూసుకునే సౌలభ్యం దక్కింది. ఈ క్రమంలోనే మన దగ్గర్నుంచి హిందీలోకి అనువాదమైన డబ్బింగ్ సినిమాలకు అపూర్వమైన ఆదరణ దక్కింది. ఇక్కడ డిజాస్టర్లయిన సినిమాలు సైతం హిందీలో కోట్లల్లో వ్యూస్ తెచ్చుకోవడం విశేషం.

రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలు సైతం ఉత్తరాదిన సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాళ్ల ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగా వ్యూస్ రావడం అనూహ్యం. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో రిలీజయ్యే తెలుగు డబ్బింగ్ సినిమాల రికార్డులు గురించి కూడా అభిమానులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.

ఐతే హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు సైతం యూట్యూబ్‌లో రికార్డులు లేకపోలేదు. ఇప్పుడు ముంబయి నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో సెటిలైపోయిన నిధి అగర్వాల్ సైతం డబ్బింగ్ సినిమాలతో ఓ అరుదైన రికార్డులు నెలకొల్పడం విశేషం. సౌత్ నుంచి మరే హీరోయిన్‌కూ లేని విధంగా ఆమెకు యూట్యూబ్‌లో 100 ప్లస్ మిలియన్ (10 కోట్లు) వ్యూస్ ఉండటం విశేషం. మొదటగా నాగచైతన్యతో చేసిన ‘సవ్యసాచి’ సినిమాతో 100 మిలియన్ వ్యూస్ క్లబ్బులోకి అడుగు పెట్టింది. తెలుగులో డిజాస్టర్ అయిన ఈ మూవీకి ఇప్పటిదాకా హిందీలో 130 మిలియన్ల దాకా వ్యూస్ రావడం విశేషం.

ఆ తర్వాత అఖిల్‌తో నిధి చేసిన ‘మిస్టర్ మజ్ను’ సైతం డిజాస్టరే అయినప్పటికీ.. హిందీలో దీనికి 200 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఇక నిధికి తెలుగులో తొలి విజయాన్నందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ అయితే ఇంకా అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. ఈ చిత్రం ఇప్పటికే 202 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో నిధినా మజాకా అంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో నిధి ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రంతో పాటు కొత్త హీరో గల్లా అశోక్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.