కొంతమంది దర్శకులకు తాము తీసే చిత్రాల్లో క్యామియో రోల్స్ చేయడం అలవాటు. తమిళంలో కె.ఎస్.రవికుమార్ తాను తెరకెక్కించిన చాలా చిత్రాల్లో క్యామియోలతో అలరించారు. కోలీవుడ్‌కే చెందిన అగ్ర దర్శకుడు మురుగదాస్‌కు సైతం ఇలా క్యామియోలు చేయడం అలవాటే. ఆయన ప్రతి సినిమాలో ఏమీ కనిపించరు కానీ.. తుపాకి, సెవన్త్ సెన్స్, సర్కార్ లాంటి చిత్రాల్లో తళుక్కుమన్నారు. ఐతే దర్శకుడు కావడానికి ముందు కూడా మురుగదాస్ కొన్ని చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని చిన్న పాత్రలు చేయడం విశేషం.
రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో మురుగదాస్ ఒక చిన్న పాత్ర సినిమా ‘పూచుదవ’. అబ్బాస్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రమిది. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1997లో విడుదలైంది. ఈ సినిమాకు మురుగదాస్ మాటల రచయితగా పని చేయడం విశేషం. అంతే కాక అందులో చిన్న క్యామియో చేశాడు.
‘పూచుదవ’లో మురుగదాస్ రెండు మూడు నిమిషాలే కనిపిస్తాడు. ఒక హోటల్లో సర్వర్ పాత్రలో ఆయన కనిపించడం విశేషం. ఆ సినిమా రిలీజైనపుడు మురుగ ఎవరో జనాలకు తెలియదు. ఆయన పేరున్న దర్శకుడిగా మారాక కూడా ఈ చిత్రంలో నటించిన చేసిన సంగతి తెలియదు. ఐతే మురుగదాస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తాను నటించిన సన్నివేశం తాలూకు వీడియోను ‘స్టోర్ రూం మెమొరీస్’ పేరుతో పంచుకున్నాడు.
ఆ సీన్లో అబ్బాస్, సిమ్రాన్, నగేష్‌లకు మురుగదాస్ టీ తెచ్చి సర్వ్ చేస్తాడు. ఈ సందర్భంగా నగేష్ అతడి పేరు అడిగితే.. ‘మురుగదాస్’ అనే చెబుతాడు. దాదాపు పాతికేళ్ల ముందు తీసిన సీన్ కావడంతో ఇప్పుడు మామూలుగా చూసినా అది మురుగదాస్ అని గుర్తుపట్టడం కష్టమే. ఈ వీడియోను ఇప్పుడు పోస్ట్ చేయడంతో మురుగదాస్ అభిమానులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ అగ్ర దర్శకుడు చివరగా ‘దర్బార్’తో పలకరించాడు. తర్వాత విజయ్‌తో అనుకున్న సినిమా రద్దయింది. తెలుగు హీరో రామ్‌తో ఓ సినిమా చేయడానికి మురుగ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.