బాలయ్య బర్త్‌డే.. రెండు అనౌన్స్‌మెంట్లు, ఒక పోస్టర్

స్టార్ హీరోల పుట్టిన రోజులు వస్తున్నాయంటే వాళ్లు అప్పటికే చేస్తున్న సినిమాల నుంచి ఏవైనా విశేషాలు బయటికి వస్తాయేమో అని చూస్తారు అభిమానులు. అలాగే కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లకు కూడా అది సందర్భంగా ఉపయోగపడుతుంటుంది. జూన్ 10న నందమూరి హీరో బాలకృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. గత ఏఢాది బర్త్ డేకి బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమా నుంచి చిన్న టీజర్ వదిలారు.

ఈ ఏడాది సందడి కాస్త ఎక్కువే ఉండబోతోందని సమాచారం. ‘అఖండ’ నుంచి ఫుల్ లెంగ్త్ టీజర్ వస్తుందని ముందు ప్రచారం సాగింది కానీ.. లాక్ డౌన్ కారణంగా అదేమీ ఉండదని తెలుస్తోంది. ఒక పవర్ ఫుల్ పోస్టర్ మాత్రం వదలబోతున్నారట. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య చేయనున్న రెండు కొత్త సినిమాల ప్రకటనలు జూన్ 10న రాబోతున్నట్లు సమాచారం.

‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను అంగీకరించిన సంగతి తెలిసిందే. బాలయ్యను గోపీ కలిసిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. మీడియా ఇంటర్వ్యూల్లో సైతం బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ధ్రువీకరించాడు గోపీచంద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఈ సినిమా గురించి వచ్చే గురువారం అధికారిక ప్రకటన రాబోతోంది.

అలాగే ఎప్పట్నుంచో బాలయ్యతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి కూడా నందమూరి హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలుస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించబోతున్నారు. ఈ సినిమా గురించి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ బాలయ్య పుట్టిన రోజు నాడే రానుందట. మొత్తానికి రెండు కొత్త అనౌన్స్‌మెంట్లకు తోడు ‘అఖండ’ పోస్టర్‌తో బాలయ్య పుట్టిన రోజు నాడు సందడి నెలకొనబోతోందన్నమాట.