ప్రభాస్‌ తెగ ఇబ్బంది పడిపోయిన సీన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, మ్యాన్లీ లుక్స్‌తో, హీరో ఎలివేషన్ సీన్లతో సినిమాల్లో హైలైట్ అవుతుంటాడు. పెర్ఫామెన్స్ పరంగా ప్రభాస్‌కు యావరేజ్ మార్కులే పడుతుంటాయి. ఐతే ‘చక్రం’ లాంటి కొన్ని సినిమాలు మాత్రం ఇందుకు మినహాయింపు. కెరీర్ ఆరంభంలో చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ నటనకు ప్రశంసలు దక్కాయి. చక్రం పాత్రను చాలా బాగా చేశాడన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో అన్ని రకాల ఎమోషన్లను పండించే అవకాశం ప్రభాస్‌కు దక్కింది.

ఐతే అందులో తన నటనకు మంచి పేరు రావడానికి దర్శకుడు కృష్ణవంశీనే కారణమని అంటుంటాడు ప్రభాస్. ఆర్టిస్టుల నుంచి పెర్ఫామెన్స్ రాబట్టుకునే విషయంలో ఒక పట్టాన రాజీ పడని కృష్ణవంశీ.. వారి నుంచి ‘ది బెస్ట్’ వచ్చే వరకు టేక్ ఓకే చెప్పడు. ‘చక్రం’ సినిమాలో తాను ఓ సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కృష్ణవంశీ ఎంతకీ రాజీ పడలేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రభాస్.

బేసిగ్గా తనకు అబ్బాయిలు అమ్మాయిల్లా ప్రవర్తించడం నచ్చదని.. సినిమాల్లోకి రాకముందు వరకు తనకు ‘గే’లు, లెస్బియన్ల గురించి పెద్దగా తెలియదని.. కానీ ‘చక్రం’ సినిమాలో ఒక సన్నివేశంలో తాను గే లాగా చేయాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడిపోయానని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. ఈ చిత్రంలో ఛార్మి ఫ్యామిలీలో పెద్ద గొడవ జరుగుతున్నపుడు.. అందరి దృష్టినీ దాన్నుంచి మళ్లించడం కోసం ప్రభాస్ ఉన్నట్లుండి గే అవతారం ఎత్తి యామినీ యామినీ అలాంటి అల్లరల్లరి చేస్తాడు. ఈ సీన్ చేయడం తన వల్ల కాలేదని.. తన కెరీర్లో బాగా ఇబ్బంది పడ్డ సన్నివేశాల్లో ఇదొకటని ప్రభాస్ చెప్పాడు.

ఐతే కృష్ణవంశీ సంగతి అందరికీ తెలిసిందే అని.. ఆయన రాజీ పడకపోవడంతో చాలా కష్టపడి ఈ సన్నివేశాన్ని పూర్తి చేశానని యంగ్ రెబల్ స్టార్ అన్నాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ‘చక్రం’ సినిమా.. ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రభాస్‌కు మాత్రం మంచి పేరే తెచ్చిందీ సినిమా. అందుకే ఈ సినిమా గురించి మాట్లాడినపుడల్లా ప్రభాస్ ఎగ్జైట్ అవుతుంటాడు.