పాపం ఆ హీరో ఇంకా ఆ దేశంలోనే..

క‌రోనా కాలంలో ఎవ‌రెన్ని ఇబ్బందులు ప‌డుతున్నా ఫిలిం సెట‌బ్రెటీలు స‌ర‌దా స‌ర‌దా ఛాలెంజ్‌లు విసురుకుంటూ చాలా హ్యాపీగా గ‌డిపేస్తున్నారని అనుకుంటున్నాం కానీ.. వాళ్ల‌లో కూడా ఇబ్బందులు ప‌డుతున్న‌వాళ్లు లేక‌పోలేదు.

అందులో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఒక‌డు. త‌న కొత్త సినిమా షూటింగ్ కోసం అత‌ను మూడు నెల‌ల కింద‌ట జోర్డాన్ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల‌కే క‌రోనా కార‌ణంగా దేశాల మ‌ధ్య ర‌వాణా ఆగిపోయింది. దీంతో పృథ్వీరాజ్ అండ్ టీం జోర్డాన్‌లోనే చిక్కుకుపోయింది.

అక్క‌డ స‌రైన తిండి దొర‌క్క పృథ్వీరాజ్, ఇత‌ర యూనిట్ స‌భ్యులు అవ‌స్థలు ప‌డుతున్న విష‌యం ఇంత‌కుముందే వెల్ల‌డైంది. ఐతే కొన్ని రోజుల‌కు ప‌రిస్థితులు కొంచెం చక్క‌బ‌డి వారికి తిండి, వ‌స‌తి స‌మ‌కూరాయి. ఐతే స్వ‌దేశానికి వ‌ద్దామంటే మాత్రం కుద‌ర‌ట్లేదు.

ఈ నెల తొలి వారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల్ని ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసి.. వంద‌ల మందిని తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే జోర్డాన్‌కు మాత్రం ప్ర‌త్యేక విమానమేదీ పంపిన‌ట్లు లేదు. దీంతో పృథ్వీరాజ్ అండ్ కో ఇంకా అక్క‌డే ఉంది. త‌న భ‌ర్త‌కు దూర‌మైన పృథ్వీ రాజ్ భార్య తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక హృద్య‌మైన పోస్టు పెట్టింది. ఎనిమిదేళ్ల కింద‌ట ఒక సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో పృథ్వీరాజ్ కూర్చుని న‌వ్వులు చిందిస్తున్న ఫొటోను ఆమె షేర్ చేసింది.

మ‌ళ్లీ ఇలా ఎప్పుడు కూర్చుని కబుర్లు చెప్పుకుంటామో తెలియ‌ట్లేద‌న్న పృథ్వీ భార్య‌.. త‌మ జీవితంలో ఇదే అతి పెద్ద ఎడ‌బాటు అని చెప్పింది. త‌న భ‌ర్త‌కు 77 రోజులుగా దూరంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఒక సూపర్ స్టార్ హీరోకు జీవితంలో ఇలాంటి అనుభ‌వం వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు.