ఓటీటీ చర్చల్లో ఉన్న సినిమాలేవి?


పోయినేడాది కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు థియేటర్లు మూతపడిపోయాయి. ముందు లాక్ డౌన్ కొన్ని వారాలే ఉంటుందని, మళ్లీ థియేటర్లు తెరుచుకుంటాయని ఆశగా చూశారు నిర్మాతలు. కానీ చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఒక మూడు నెలలు గడిచాక కానీ.. వాస్తవం బోధపడలేదు. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకోవని అర్థమయ్యాక విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

చివరికి ఏడాది ఆఖర్లో థియేటర్లు తెరుచుకోవడం, నెమ్మదిగా జనాలు రావడం.. క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఇక మళ్లీ ఎప్పటికీ గత ఏడాది పరిస్థితులు పునరావృతం కావనే అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఊహించని దెబ్బ కొట్టింది. మళ్లీ థియేటర్లను మూత వేయించింది. చూస్తుండగానే నెలన్నర గడిచిపోయింది. ఇంకో నెల రోజులకు కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

కొందరు ఆగస్టులో థియేటర్లు పున:ప్రారంభం అవుతాయంటున్నారు. ఇంకొందరు దసరా వరకు ఆగక తప్పదంటున్నారు. మళ్లీ థియేటర్లు మొదలైనా 100 శాతం ఆక్యుపెన్సీ రావడానికి వచ్చే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సి రావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి ఖాయమంటున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల నిర్మాతలందరితోనూ ఓటీటీల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఐతే లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం లాంటి సినిమాల మేకర్స్ తమ చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఇవి కాకుండా అరడజను సినిమాల మీద ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కన్నేశాయి.

సత్యదేవ్ సినిమా ‘తిమ్మరసు’తో పాటు తేజ-ప్రియ ప్రకాష్ జంటగా నటించిన ‘ఇష్క్’, వైష్ణవ్ తేజ్-క్రిష్ సినిమాలు కచ్చితంగా ఓటీటీలో రిలీజవుతాయంటున్నారు. ఇక ఓటీటీ రిలీజ్‌కు గతంలో నో అన్న ‘పాగల్’తో పాటు తాజాగా సాయితేజ్ మూవీ ‘రిపబ్లిక్’, నితిన్ మూవీ ‘మేస్ట్రో’ సైతం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ జాబితాలోకి వచ్చాయంటున్నారు. వీటి మేకర్స్‌తో ఓటీటీల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘ఏక్ మిని కథ’కు మంచి స్పందన రావడం.. అదే సమయంలో థియేటర్లు తెరుచుకోవడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో వీటిలో మెజారిటీ సినిమాలు ఓటీటీల్లో రిలీజయ్యే అవకాశముంది.