సతీష్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్న సురేష్ బాబు!

ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు అందుకున్నారు. నేటి తరానికి నచ్చే విధంగా కథలను రాసుకుంటూ.. తెరపై చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు కూడా చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా బ్యానర్ లు స్థాపించి వాటిపై సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటారు.

చిన్న సినిమాలు ఏవైనా నచ్చితే తన బ్యానర్ లో వాటిని రిలీజ్ చేస్తుంటారు. అలానే కొత్త దర్శకులు చెప్పే కథలు తనకు నచ్చితే గనుక తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి సురేష్ బాబు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు సురేష్ బాబు.

అయితే సతీష్ చెప్పిన కథలో రానా హీరోగా నటిస్తారా..? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతానికైతే సురేష్ బాబు.. ఈ కొత్త దర్శకుడితో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం సురేష్ బాబు ప్రొడక్షన్స్ పై ‘నారప్ప’, ‘దృశ్యం 2’ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.