అవార్డు వెన‌క్కిచ్చేస్తున్న వైర‌ముత్తు


ఒక‌టి రెండు కాదు ఏకంగా ఏడు జాతీయ అవార్డులు.. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ పురస్కారాలు.. ఇంకా కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు.. త‌మిళ లెజెండ‌రీ లిరిసిస్ట్ వైర‌ముత్తు ఘ‌న‌త‌లివి. ఇంకా మ‌రెన్నో గౌర‌వాలు పొందిన ఆయ‌న మీద గాయ‌ని చిన్మ‌యి, మ‌రికొంద‌రు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. మూడేళ్ల నుంచి ఈ గొడ‌వ న‌డుస్తూనే ఉంది. వైర‌ముత్తు మీద చేసిన ఆరోప‌ణ‌లకు రుజువులు లేకున్నా, ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌కున్నా.. ఆయ‌న ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయిన మాట వాస్త‌వం.

తాజాగా వైర‌ముత్తుకు కేర‌ళ‌కు చెందిన ఓఎన్వీ అకాడ‌మీ ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌గా.. దాని మీద పెద్ద గొడవే జ‌రుగుతోంది. రెండంకెల సంఖ్య‌లో అమ్మాయిలు లైంగింక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన వ్యక్తికి ఇలాంటి పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు తలెత్తాయి. చిన్మ‌యి మాత్ర‌మే కాదు.. ఎంతోమంది గాయ‌కులు, ర‌చ‌యిత‌లు ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. జ్యూరీ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించారు.

ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వైర‌ముత్తు స్పందించారు. ఓన్‌వీ అకాడ‌మీ పుర‌స్కారాన్ని తాను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వివాదం గురించి ఆయ‌న పెద్ద‌గా ఏమీ మాట్లాడ‌కుండా.. త‌న వ‌ల్ల జ్యూరీ ఇబ్బంది ప‌డ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని.. అందుకే అవార్డును వెన‌క్కి ఇచ్చేస్తున్నాన‌ని తెలిపారు. ఈ అవార్డు కింద త‌న‌కు ఇస్తున్న ప్రైజ్ మ‌నీ రూ.3 ల‌క్ష‌ల‌ను కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు జ‌మ చేయ‌నున్న‌ట్లు కూడా వైర‌ముత్తు ప్ర‌క‌టించారు. దానికి తోడు రూ.2 ల‌క్ష‌ల మొత్తాన్ని తాను వ్య‌క్తిగ‌తంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా తెలిపారు.

కేర‌ళ ప్ర‌జ‌లు త‌న ప‌ట్ల చూపించే అప‌రిమిత ప్రేమాభిమానాల‌కు బ‌దులుగా ఇలా చేస్తున్న‌ట్లు కూడా ఆయ‌న పేర్కొన్నారు. కాగా వైర‌ముత్తుకు అవార్డు ప్ర‌క‌టించ‌డంపై తీవ్ర విమర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తామ‌ని ఓఎన్‌వీ అకాడమీ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ లోపే వైర‌ముత్తు స్పందించి అవార్డును వెన‌క్కిచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైర‌ముత్తుపై పోరాడి అల‌సిపోయిన చిన్మ‌యి అండ్ కోకు ఇది నైతిక విజ‌యం అన‌డంలో సందేహం లేదు.