బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కుల డీల్ పూర్తయిందని, రూ.325 కోట్ల రికార్డు రేటుకు జీ నెట్ వర్క్ వాళ్లు రైట్స్ తీసుకున్నారని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటిదాకా అది ప్రచారం మాత్రమే కాగా.. ఇప్పుడు ఈ డీల్ గురించి అధికారిక సమాచారం బయటికి వచ్చింది.
ఐతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కొంత వరకే నిజం. ఈ డీల్ పూర్తి విశేషాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న పెన్ మూవీస్ సంస్థనే డిజిటల్, శాటిలైట్ హక్కులన్నింటినీ కలిపి హోల్‌సేల్‌గా కొనేసింది. ఐతే వాళ్లు తర్వాత ఆయా భాషలకు, ఏరియాలకు తగ్గట్లు వేర్వేరుగా ఓటీటీలు, టీవీ ఛానెళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ విశేషాలను ఒక వీడియో ద్వారా బయటపెట్టారు.
ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లను జీ 5 ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. కాగా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక శాటిలైట్ హక్కులను కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు ఛానెళ్లకు ఇచ్చారు. హిందీ వెర్షన్ జీ నెట్‌వర్క్‌లోనే రాబోతుండగా.. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్లు స్టార్ లోకల్ ఛానెళ్లలో రిలీజవుతాయి. మలయాళంలో ఏషియా నెట్‌కు హక్కులు ఇచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ ఐదు విదేశీ భాషల్లోనూ విడుదల కాబోతుండటం విశేషం.
ఇంగ్లిష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. వీటి డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్కే ఇచ్చారు. మొత్తంగా ఈ డీల్‌ను కళ్లు చెదిరే రేటుకే పెన్ మూవీస్ సొంతం చేసుకుని వేర్వేరు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్ హక్కుల ధరే రూ.325 కోట్లని వార్తలు రాగా.. శాటిలైట్ హక్కులు కూడా కలిపితే డీల్ రూ.500 కోట్లకు తక్కువగా ఉండే అవకాశమే లేదు.