బీఏ రాజు చేస్తున్నవన్నీ అలాగే..

నాలుగు దశాబ్దాల కిందట్నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ.. ఏకంగా 1500 సినిమాలకు పీఆర్వోగా పని చేసి.. పరిశ్రమలోని అందరితోనూ చాలా సన్నిహితంగా మెలుగుతూ.. అందరివాడిగా పేరు తెచ్చుకుని.. ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉన్న బీఏ మూడు రోజుల కిందట హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం సాయంత్రం కూడా ఓ సినిమా గురించి ట్వీట్ వేసిన ఆయన.. ఆ రోజు రాత్రి గుండె పోటుతో మరణించారు. ఇది సినీ పరిశ్రమకు మామూలు షాక్ కాదు. టాలీవుడ్‌కు సంబంధించి చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాతోనూ ఏదో రకంగా ఆయనకు సంబంధం ఉంటుంది. తెలియని వాళ్లు తీసిన సినిమా అయినా సరే.. దాన్ని తన వంతుగా ప్రమోట్ చేస్తారు.

ట్విట్టర్ అకౌంట్ ద్వారానే కాక సుదీర్ఘ చరిత్ర ఉన్న ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ ద్వారా.. అలాగే ‘ఇండస్ట్రీ హిట్’ పేరుతో నెలకొల్పిన వెబ్ సైట్ ద్వారా ఆయన సినిమాలకు మంచి ప్రచారం కల్పిస్తారు. అలాగే ఆయన పీఆర్ టీం సైతం సినిమాలకు ఎంత బాగా పబ్లిసిటీ చేస్తుందో అందరికీ తెలుసు. ఐతే బీఏ రాజు ఉన్నట్లుండి చనిపోవడంతో ఇక వీటన్నింటినీ నడిపించేదెవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఇండస్ట్రీలో ఇంకెవరి దగ్గరా లేని విధంగా ఎన్నో దశాబ్దాల కిందటి సినిమాల సమాచారం ఉన్న రాజు.. వాటి గురించి ట్వీట్లు వేసే ఇక మిస్ అయిపోతామేమో అని ఆయన్ని ట్విట్టర్లో అనుసరించే 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఫీలవుతున్నారు.

ఐతే రాజు లేకపోయినా.. తను చేస్తూ వచ్చిన పనులన్నీ అలాగే కొనసాగుతాయంటూ ఆయన తనయుడు శివకుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాడు. దర్శకత్వ విభాగంలో పని చేసిన శివకుమార్ ‘22’ అనే సినిమా తీశాడు. అది ఇంకా విడుదల కాలేదు. తండ్రి ఉండగా దర్శకత్వం మీదే దృష్టిపెట్టిన శివకుమార్.. ఇప్పుడు తన తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. రాజు దగ్గరున్న పీఆర్ టీంతో కలిసి పని చేస్తానని.. అలాగే ఆయన నడుపుతున్న సూపర్ హిట్ మ్యాగజైన్, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ల నిర్వహణ చూసుకుంటానని.. రాజు ట్విట్టర్ అకౌంట్ కూడా అలాగే కొనసాగుతుందని వెల్లడించాడు. సినీ ప్రముఖులను త్వరలోనే కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తానని, తనకు అందరూ సహకారం అందించాలని శివకుమార్ కోరాడు.