సుడి‘గాలోడు’ సుధీర్


జబర్దస్త్ కామెడీ స్కిట్లు చేసుకునే ఆర్టిస్టులు కదా అని హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లను ఎంతమాత్రం తక్కువ చేసి చూడలేం. సినిమా హీరోలకు దీటుగా వాళ్లకు ఫాలోయింగ్ ఉంది. వీళ్లు చేసిన స్కిట్లు ఒక్కోదానికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ముఖ్యంగా జబర్దస్త్‌లో అత్యంత సీనియర్లలో ఒకడైన సుధీర్‌కు మామూలు ఫాలోయింగ్ లేదు. అతడి పేరు మీద పదుల సంఖ్యలో ఫ్యాన్ క్లబ్ పేజీలు కనిపిస్తాయి అక్కడ.

ఇక బుధవారం సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ముందు రోజు సాయంత్రం నుంచే అతడి పేరు మీద ట్రెండ్ నడుస్తుండటం విశేషం. #HBDsudigalisudheer అనే హ్యాష్ ట్యాగ్ మీద బుధవారం మధ్యాహ్నానికి లక్షా 60 వేల ట్వీట్లు పడటం.. ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా ఉండటం విశేషం. స్టార్ హీరోల పుట్టిన రోజులప్పుడు మాత్రమే ట్విట్టర్లో ఇలాంటి సందడి కనిపిస్తుంది.

సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా అతడి కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్ పెట్టడం విశేషం సుడిగాలి అనే మాటను ఇంటి పేరుగా మార్చుకున్న సుధీర్‌ను స్కిట్లలో సహచరులు గాలోడు అని కూడా అంటుంటారు. దాన్నే ఇప్పుడు తన సినిమాకు టైటిల్‌గా పెట్టేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. బాగా గడ్డం పెంచి.. చెవిపోగులతో మిడిలేజ్డ్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడు సుధీర్. మోషన్ పోస్టర్లో బిల్డప్ కూడా బాగానే ఇచ్చారు.

ఇంతకుముందు సుధీర్ హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమా తీసిన రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల అనే దర్శకుడే ఈ చిత్రాన్ని కూడా రూపొందించున్నాడు. ఇది కాక సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్ర’ అనే ఒక థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్‌ను కూడా బుధవారమే లాంచ్ చేశారు. అరుణ్ విక్కిరాల అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్‌’తో పాటు ‘3 మంకీస్’తో ఆకట్టుకోలేకపోయిన సుధీర్‌కు ఈ చిత్రాలైనా మంచి ఫలితాన్నిస్తాయేమో చూడాలి.