మళ్లీ ‘ఫిదా’ కాంబినేషన్?


ఒక సినిమాతో మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఆ చిత్రంతో భారీ విజయాన్ని కూడా అందుకుంటే మళ్లీ ఆ కలయికలో సినిమా చూడాలని ప్రేక్షకులు ఆశపడతారు. దర్శక నిర్మాతలు కూడా ఆ కాంబినేషన్లను రిపీట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటి హిట్ కాంబినేషన్లు ఎన్నో చూశాం. ఇప్పుడు టాలీవుడ్లో మరో హిట్ పెయిర్ రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ఆ జంట వరుణ్ తేజ్-సాయిపల్లవిలదట.

వీళ్లిద్దరూ ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో సాయిపల్లవి చేసిన తొలి చిత్రమిది. అప్పటికే మలయాళంలో ‘ప్రేమమ్’తో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న సాయిపల్లవి.. ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులనూ కట్టి పడేసింది. ఈ చిత్రంలో వరుణ్ సైతం పాత్రకు తగ్గట్లు చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. వరుణ్-సాయిపల్లవి జంట సినిమాలో చూడముచ్చటగా అనిపించింది.

ఐతే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వరుణ్-సాయిపల్లవిల జోడీని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. యువ దర్శకుడు వెంకీ కుడుముల వీరి కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. ఛలో, భీష్మ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ.. మూడో సినిమాను పట్టాలెక్కించడంలో కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. ఈసారి పెద్ద స్టార్‌తో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. అతడి మూడో సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా అధికారిక సమాచారం ఏదీ లేదు.

ఐతే ఇప్పుడు వరుణ్ హీరోగా సినిమా చేయడానికి వెంకీ సిద్ధమవుతున్నాడని.. ఇందులో సాయిపల్లవి కథానాయిక అని ప్రచారం జరుగుతోంది. ఒక పేరున్న నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం వరుణ్ ‘గని’ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.