ప్రభుదేవా.. నీకో దండం


మే 13 కోసం సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. భాయ్ కొత్త సినిమా ‘రాధె’ ఈ రోజే రిలీజ్. ఇంటర్నేషనల్ మార్కెట్లలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ఇండియాలో చాలా వరకు థియేటర్లు మూతపడి ఉండటంతో ‘జీ’ ఓటీటీ, డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజైంది. సల్మాన్ సినిమా అంటే హడావుడి మామూలుగా ఉండదు కదా. శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియా చర్చలన్నీ దీని గురించే.

ముందు ట్విట్టర్లో #radhe #salmankhan అన్న హ్యాష్ ట్యాగ్‌లే ట్రెండ్ అయ్యాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి అవి పక్కకు వెళ్లిపోయి ప్రభుదేవా పేరు ట్రెండ్ అవడం మొదలైంది. ఇలా ట్రెండ్ అవుతున్నాడంటే ప్రభుదేవాను జనాలు పొగిడేస్తున్నారు అనుకుంటే పొరబాటే. సల్మాన్ ఫ్యాన్స్ సహా అందరూ ప్రభుదేవాను ట్రోల్ చేస్తున్న క్రమంలోనే అతడి పేరు ట్రెండ్ అవుతోంది.

దర్శకుడిగా కెరీర్‌ను ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి మంచి సినిమాతో మొదలుపెట్టాడు ప్రభుదేవా. కానీ అతడి క్రియేటివిటీ అంతా ఆ సినిమాతోనే అయిపోయింది. ఆ తర్వాతి నుంచి ఎక్కువగా రీమేక్ చిత్రాలు, రొటీన్ మాస్ మసాలా సినిమాలతో లాగించేస్తున్నాడు. పోకిరి, విక్రమార్కుడు లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే బాగానే ఆడాయి కానీ.. ఆ తర్వాత ప్రభుదేవా తీసిన స్ట్రెయిట్ సినిమాలన్నీ తుస్సుమనిపించాయి.

సల్మాన్‌తో చివరగా అతను చేసిన ‘దబంగ్ 3’ డిజాస్టర్ అయింది. అయినా సరే.. వెంటనే అతడితో ‘రాధె’ చేశాడు. ఏదో కొరియన్ సినిమా రీమేక్ అంటే.. ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని అనుకున్నారు. కానీ సౌత్ ఇండియాలో దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ మాస్ మసాలా సినిమాలనే అటు తిప్పి ఇటు తిప్పి లాగించేశాడు. సినిమా మొదలైనప్పటి నుంచి హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు తప్ప ఇంకేమీ లేవిందులో. సినిమా అంతా బూతద్దం పెట్టి వెతికినా ఒక్క కొత్త సీన్ లేదు. మరీ రొడ్డకొట్టుడుగా అనిపించే సన్నివేశాలతో సినిమాను నింపేశాడు ప్రభుదేవా. సల్మాన్ ఫ్యాన్స్ కొందరు ఈ రొటీన్ మసాలా సినిమా చూసి సంతృప్తి చెందారేమో కానీ.. మెజారిటీ ప్రేక్షకులు ‘రాధె’ చూసి ప్రభుదేవా నీకో దండం అనేస్తున్నారు.