ఆ సినిమాకు అంతుందా?


ఏక్ మిని కథ అని ఓ చిన్న సినిమా. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన యువి క్రియేషన్స్ వాళ్లు.. ‘యువి కాన్సెప్ట్స్’ పేరుతో వేరే బేనర్ పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ప్రోత్సహించే క్రమంలో తెరకెక్కించిన తొలి చిత్రమిది. దీని టీజర్, ట్రైలర్ చూస్తే ఇది కొంచెం బోల్డ్‌గా ఉండే సినిమాఅ ని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ కాన్సెప్ట్ వల్లే జనాల్లో ఈ సినిమా గురించి కొంత చర్చ జరిగింది.

ప్రమోషన్లు, సోషల్ మీడియా ప్రచారం బాగానే చేశారు. ఐతే ఈ కాన్సెప్ట్‌ను జనాలు ఏమేర రిసీవ్ చేసుకుంటారనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. గత నెల 30న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్ర బృందం.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా వేసుకుంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేని నేపథ్యంలో ఈ టైపు చిన్న సినిమాలకు డైరెక్ట్ ఓటీటీ రిలీజే శరణ్యం అనుకుంటున్నారు. ఓటీటీలకు కూడా కొత్త కంటెంట్ అవసరమే కాబట్టి అటు నుంచి కూడా ఆసక్తి కనబరచడంతో ‘ఏక్ మిని కథ’ డిజిటల్ రిలీజ్ విషయమై చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఐతే యువి వాళ్ల బ్రాండ్ వాల్యూ కలిసొస్తే కలిసి రావచ్చు కానీ.. ఈ చిన్న సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏకంగా రూ.9 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని, డీల్ అయిపోయిందని మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. ఇది చిత్ర బృందం నుంచి బయటికొచ్చిన లీక్ న్యూసే అంటున్నారు. తమ సినిమాకు హైప్ తేవడం కోసం ఇలా ప్రచారం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. కాన్సెప్ట్ చూస్తే మరీ బోల్డ్. దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు. హీరోకు ఇప్పటిదాకా సక్సెస్ లేదు. పెద్దగా పేరు లేదు. హీరోయిన్ కొత్తమ్మాయి. దర్శకుడూ కొత్తోడే. కొంతమేర కుర్రకారును ఆకర్షించడం తప్పితే.. ఈ సినిమాకు అంత హైప్ అయితే లేదు. ఇలాంటి సినిమాకు 9 కోట్లు పెట్టేంత సాహసం ఏ ఓటీటీ అయినా చేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించదు.