సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ లాగా సోషల్ మీడియా ఇంకెవ్వరూ ట్రోలింగ్ ఎదుర్కొని ఉండరేమో. విమర్శకులకు అతను ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్టే. ఎందుకంటే అతను చాలా సౌమ్యుడు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడడు. మీడియాలో తన గురించి వ్యతిరేక వార్తలు వచ్చినా కూడా ఘాటుగా ఏమీ స్పందించడు. తన విమర్శకులు, ట్రోలర్స్ పట్ల తమన్ స్పందన కూడా కూల్‌గానే ఉంటుంది. దీన్ని అలుసుగా తీసుకుని అతడి మీద ట్రోల్స్ కొనసాగిస్తుంటారు నెటిజన్లు.
నిజానికి ఒకప్పుడు తమన్ సంగీతం ఒక మూసలో సాగిపోయేది. అతడి ట్యూన్లు రిపీట్ అవుతుండేవి. కొన్ని పాటలకు వేరే చోట్ల నుంచి అతను స్ఫూర్తి పొందిన మాటా వాస్తవం. కానీ గత కొన్నేళ్లలో తమన్ చాలా మారాడు. కొత్తదనం కోసం బాగా కష్టపడుతున్నాడు. అదిరిపోయే ఆల్బమ్స్ ఇస్తున్నాడు. అయినా సరే.. అప్పుడప్పుడూ అతణ్ని నెటిజన్లు టార్గెట్ చేస్తూనే ఉంటారు.
తాజాగా ఒక నెటిజన్.. తమన్‌ను అవమానించేలా ఒక పోస్ట్ పెట్టాడు. ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తాలూకు కొన్ని స్టిల్స్ తీసుకొచ్చి రేప్పొద్దున తన పిల్లలకు ఇతనే తమన్ అని చూపిస్తా అంటూ కామెంట్ చేశాడతను. అతను తమన్ ట్విట్టర్ హ్యాండిల్‌ను సైతం ట్యాగ్ చేశాడు. ఇది తమన్ కంట పడింది. ఆ నెటిజన్ ఉద్దేశమేంటో అర్థమై.. కూల్‌గా అతడికి కౌంటర్ ఇచ్చాడు. ‘‘అలాగే దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నానని కూడా చెప్పు. తాను ఒక పనికిమాలిన మీమర్‌ను పెళ్లి చేసుకున్నానని గర్వపడుతుంది’’ అంటూ ఫన్నీ ఎమోజీలు పెట్టాడు తమన్.
దీంతో ఆ నెటిజన్‌కు నోట మాట రాలేదు. తమన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడంటూ అతడి ఫ్యాన్స్ కొనియాడారు. సదరు నెటిజన్‌ను వాయించి వదిలిపెట్టారు. నిజానికి ‘కింగ్’లో జయసూర్య పాత్ర దివంగత సంగీత దర్శకుడు చక్రిని టార్గెట్ చేసి పెట్టిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై చక్రి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐతే చక్రి తనకు మంచి మిత్రుడని.. అతణ్ని ఉద్దేశించి ఆ పాత్ర సృష్టించలేదని దర్శకుడు శ్రీను వైట్ల క్లారిటీ ఇచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates