గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే కొత్త సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందులోనూ స్టార్ హీరోల సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడానికి నిర్మాతలకు మనసొప్పడం లేదు. నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ను ముందు నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ చేయడానికి డీల్ కుదిరినా.. తర్వాత దాన్ని రద్దు చేసుకుని మరీ ముందు థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి టైంలో ఒక పెద్ద సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేయడంపై వివాదం నడిచింది. ఆ సినిమానే.. జగమే తంత్రం.
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన చిత్రమిది. గత ఏడాది లాక్ డౌన్ పెట్టడానికి ముందే ఈ సినిమా పూర్తయింది. కానీ థియేట్రికల్ రిలీజ్ కోసం ఆపారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ చేయడానికి నిర్మాత శశికాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ధనుష్, అతడి అభిమానులకు ఈ నిర్ణయం నచ్చకున్నా సరే.. ఏమీ చేయడానికి వీల్లేకపోయింది.
‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్ గురించి రెండు నెలల ముందే ప్రకటన వచ్చినప్పటికీ.. ధనుష్ మరో సినిమా ‘కర్ణన్’ థియేట్రికల్ రిలీజ్ ఉండటంతో దాన్ని ఆపి ఉంచారు. ఈ నెల 9న ‘కర్ణన్’ విడుదలై సూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ‘జగమే తంత్రం’ విడుదల గురించి ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. బ్యాగ్రౌండ్లో ఫారిన్ లొకేషన్లో భారీ భవంతులు కనిపిస్తుండగా.. అల్ట్రా స్టైలిష్‌గా ఉన్న ధనుష్ ముఖచిత్రంతో ఉన్న ఒక కొత్త పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ధనుష్, కార్తీక్‌లకు తెలుగులోనూ మంచి గుర్తింపే ఉన్న నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అంతర్జాతీయ మాఫియా గొడవల నేపథ్యంలో నడిచే సినిమా ఇది. ఇందులో ధనుష్ అతి సామాన్యుడిగా మొదలుపెట్టి పెద్ద డాన్ అయిన క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తి రేకెత్తించగా.. రిలీజ్ ముంగిట ట్రైలర్ వదలబోతున్నారు. ధనుష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించడం విశేషం.