శంక‌ర్ కోసం సైన్యం దిగింది


త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. రెండు రోజుల కింద‌టే బాలీవుడ్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అన్నియ‌న్ (అప‌రిచితుడు)ను హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు శంక‌ర్ ప్ర‌క‌టించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే అన్నియన్ నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్ దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అన్నియ‌న్ నిర్మాత‌గా ఆ సినిమా క‌థ మీద హ‌క్కులు త‌న‌కే ఉన్నాయ‌ని.. త‌న అనుమ‌తి లేకుండా సినిమాను రీమేక్ చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై శంక‌ర్‌కు లీగ‌ల్ నోటీసులు కూడా పంపుతున్న‌ట్లు చెప్పారు.

ఐతే దీనికి శంక‌ర్ దీటుగానే బ‌దులిచ్చారు. అన్నియ‌న్ క‌థా ర‌చ‌యిత‌గా క్రెడిట్ త‌న‌దే అని, ఆ క‌థ‌ను రీమేక్ చేయ‌డంపై త‌న‌కు పూర్తి హ‌క్కులున్నాయ‌ని ర‌విచంద్ర‌న్‌కు బ‌దులిచ్చారు. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వ్య‌వ‌హారంలో ఇండ‌స్ట్రీ నుంచి మెజారిటీ మ‌ద్ద‌తు శంక‌ర్‌కే ల‌భిస్తోంది. క‌థ రాసిన వ్య‌క్తికి దాని మీద హ‌క్కులుండ‌వా అంటూ ఇండ‌స్ట్రీ జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. శంక‌ర్ కోసం ఇండ‌స్ట్రీ నుంచి పెద్ద సైన్య‌మే దిగింది. ప్ర‌స్తుతం స్టార్ ద‌ర్శ‌కులుగా ఉన్న అత‌డి శిష్యులంద‌రూ ముందుకు వ‌చ్చారు. చింబుదేవ‌న్, అరిగ‌ళ‌వ‌న్, అట్లీ.. ఇలా ఒక్కొక్క‌రుగా శంక‌ర్‌కు మ‌ద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. అరివ‌ళ‌గ‌న్ అయితే అన్నియ‌న్ సినిమాకే అసిస్టెంట్‌గా కూడా ప‌ని చేశాడు. ఆ సినిమాకు ప‌ని చేసిన అనుభ‌వంతో తాను చెబుతున్నాన‌ని, అన్నియన్ కథ క్రెడిట్ పూర్తిగా శంకర్‌దే అని.. తాను ఆయనకు మద్దతిస్తున్నానని అతను పేర్కొన్నాడు.

శంకర్‌కు మద్దతుగా ఇలా చాలామంది కోలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చారు. వాళ్లందరూ #Isupportdirectorshankar అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శంకర్‌తో ఆస్కార్ రవిచంద్రన్ గొడవ ఈనాటిది కాదు. ‘ఐ’ సినిమా బడ్జెట్ విషయంలో ఇద్దరికీ తగవు నడిచింది. ఈ సినిమా టైంలోనే రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. ఆ సినిమా విడుదల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి గొడవను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రవిచంద్రన్.. శంకర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్న వాదన వినిపిస్తోంది.