క‌ర్కోట‌కుడిగా మారిన ప్ర‌భుదేవా


ప్ర‌భుదేవాను మొద‌ట్లో అంద‌రూ డ్యాన్స్ మాస్ట‌ర్ అనేవాళ్లు. ఆ త‌ర్వాత అత‌ణ్ని హీరోగా పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. ఆపై అత‌ను ద‌ర్శ‌కుడిగానూ మారాడు. ఇలా బ‌హుముఖ ప్ర‌జ్ఞ క‌న‌బ‌రిచేవాళ్లు అరుదుగా క‌నిపిస్తారు. ఏదో ఒక విభాగానికి ప‌రిమితం అయిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పాత్ర పోషించ‌డం ప్ర‌భుదేవాకే చెల్లు. మ‌ధ్య‌లో కొన్నేళ్లు న‌ట‌న‌కు కాస్త దూరంగా ఉన్న ప్ర‌భు.. కొన్నేళ్ల కింద‌ట‌ మ‌ళ్లీ ముఖానికి రంగేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు.

అభినేత్రి, అభినేత్రి-2, ల‌క్ష్మి లాంటి సినిమాల్లో న‌టించిన అత‌ను.. ఇప్పుడు భ‌గీరా అంటూ కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. అది చూసిన వాళ్లు షాక‌వ్వ‌కుండా ఉండ‌లేరు. ఎర్ర‌గులాబీలు త‌ర‌హా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భుదేవా అమ్మాయిల్ని ల‌క్ష్యంగా చేసుకుని వారిని దారుణంగా హ‌త్యలు చేసే క‌ర్కోట‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తుండ‌టం విశేషం.

భగీరా పాత్ర‌లో ర‌క‌ర‌కాల అవ‌తారాల్లో క‌నిపించిన ప్ర‌భుదేవా.. సైకోలా ప్ర‌వ‌ర్తిస్తూ అమ్మాయిల‌పై త‌న క‌ర్క‌శ‌త్వాన్ని చూపించాడు. అప్పుడెప్పుడో ధ‌నుష్ స‌ర‌స‌న త‌మిళంలో ఓ సినిమా చేసి వెళ్లిపోయిన‌ బాలీవుడ్ భామ అమైరా ద‌స్తూర్.. మ‌ళ్లీ ఈ సినిమాతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. టీజ‌ర్లో ఆమె హాట్ హాట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. ర‌మ్య నంబీశ‌న్, జ‌న‌ని అయ్య‌ర్, గాయత్రి, సోనియా అగ‌ర్వాల్.. ఇలా సినిమాలో లేడీ క్యారెక్ట‌ర్లు చాలానే ఉన్నాయి. వాళ్లంద‌రూ టీజ‌ర్లో ఫ్లాష్ లాగా క‌నిపించారు.

ఐతే సినిమాలో మాత్రం ప్ర‌భుదేవా పాత్ర‌, అత‌డి లుక్స్, త‌న యాక్టింగే హైలైట్ అయ్యేలా ఉన్నాయి. కొన్ని స‌న్నివేశాల్లో ప్ర‌భుదేవా గుండుతో క‌నిపించిన ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌భు కెరీర్లో ప్ర‌త్యేక‌మైన సినిమా అయ్యేలా క‌నిపిస్తున్న భ‌గీరాకు ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ వేస‌విలోనే సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.