పుష్ఫ.. అప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పుష్ప ఒక‌టి. త‌మ చివరి చిత్రాల‌తో నాన్ బాహుబ‌లి హిట్లు ఇచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. దీనిపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తొలి ద‌శలో ఉండ‌గానే హ‌డావుడిగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు. క‌రోనా కార‌ణంగా చాలా సినిమాలు పెండింగ్‌లో ప‌డిపోవ‌డంతో రిలీజ్ డేట్ల కోసం పోటీ నెల‌కొన్న టైంలో పుష్ప టీం కూడా విడుద‌ల గురించి ప్ర‌క‌ట‌న చేసింది.

కానీ అలా డేట్ అయితే ఇచ్చారు కానీ.. దాన్ని అందుకుంటామా లేదా అన్న డౌట్ చిత్ర బృందంలో ముందు నుంచి ఉంది. ఎందుకంటే సుకుమార్ మేకింగ్ కోసం చాలా టైం తీసుకుంటాడు. ఒక ప‌ట్టాన దేనికీ సంతృప్తి చెంద‌డు. అందుకే డెడ్ లైన్ విష‌యంలో సందేహాలు ఉన్నాయి. ఉన్నంత‌లో వేగంగానే చిత్రీక‌ర‌ణ చేస్తున్న‌ప్ప‌టికీ ఆగ‌స్టు 13కు సినిమాను రిలీజ్ చేయ‌డంపై అనుమానాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

అందులోనూ ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో షెడ్యూళ్లు అనుకున్న‌ట్లు సాగేలా లేవు. ఈ నేప‌థ్యంలోనే పుష్ప సినిమా వాయిదా అనివార్యం అన్న అభిప్రాయం చిత్ర బృందంలో వ‌చ్చేసింద‌ట‌. అందుకే ప్ర‌త్యామ్నాయ తేదీల గురించి ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ సైతం వాయిదా ప‌డేలా ఉండ‌టంతో.. ఆ సినిమా రావాల్సిన తేదీకి పుష్ప‌ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంద‌ని చూస్తున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ టీం నుంచి స్ప‌ష్ట‌త కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిసిందే.

వ‌చ్చే నెల రోజుల్లో ప‌రిస్థితిని బ‌ట్టి త‌మ సినిమాను వెన‌క్కి తీసుకెళ్ల‌డం, ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌టంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని.. రెండూ వాయిదా ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తే అక్టోబ‌రు 13న త‌మ సినిమాను రిలీజ్ చేద్దామ‌ని అనుకుంటున్నార‌ట‌. అలా కాని ప‌క్షంలో దీపావ‌ళి లేదా క్రిస్మ‌స్ మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఇప్ప‌టికే బెర్తులు ఖ‌రారైన నేప‌థ్యంలో ఆ సీజ‌న్ గురించి ఆలోచించ‌ట్లేద‌ని తెలిసింది.