చిరుపై మెగా అభిమానుల ఎటాక్

రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశాక అంద‌రి వాడిగా ఉండాల‌ని చూస్తున్నాడు నెగెటివిటీ అనేది ఎంత‌మాత్రం ద‌రి చేర‌కుండా చూసుకుంటున్నాడాయ‌న‌. మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల ప‌ట్ల ఆయ‌న పూర్తి సానుకూల‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయినా స‌రే.. చిరు మాత్రం జ‌గ‌న్‌తో స‌ఖ్య‌తతో ఉండే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు.

గ‌త ఏడాది సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన విష‌యాల‌పై నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్లి మ‌రీ క‌లిసి మాట్లాడి వ‌చ్చాడు చిరు. అంతే కాక జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా స్టేట్మెంట్ కూడా ఇవ్వ‌డం తెలిసిందే. అలాగే ఇండ‌స్ట్రీకి సంబంధించి అనుకూల నిర్ణ‌యాలు తీసుకున్న‌పుడ‌ల్లా జ‌గ‌న్‌ను పొగుడుతూ ట్వీట్లు వేయ‌డ‌మూ విదిత‌మే.

ఐతే ఇది మొద‌ట్నుంచి మెగా అభిమానుల్లో చాలామందికి రుచించ‌డం లేదు. చిరు అంత విధేయత ప్ర‌ద‌ర్శిస్తే జ‌గ‌న్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని వాళ్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌కీల్ సాబ్ టికెట్ల రేట్ల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ముందు వేరే సినిమాల‌కు టికెట్ల రేట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చి.. ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని వ‌కీల్ సాబ్ థియేట‌ర్ల మీద దాడులు చేయించ‌డం, కోర్టుకు వెళ్లి మ‌రీ రేట్ల పెంపుకు వ్య‌తిరేకంగా ఆదేశాలు ఇవ్వ‌డం వంటి పరిణామాలు మెగా అభిమానుల‌కు అస్స‌లు రుచించ‌ట్లేదు.

ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా జ‌గ‌న్‌ను పొగ‌డ్డానికి చూసే చిరు.. ఇక‌పై అలాంటివి మానుకోవాల‌ని, ఇప్పుడు వ‌కీల్ సాబ్‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఏపీ స‌ర్కారును ప్ర‌శ్నించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ స‌ర్కారు తీరు మున్ముందు భారీ చిత్రాల‌కు ఇబ్బంది తెచ్చేలా ఉన్న నేప‌థ్యంలో చిరు స‌హా మిగ‌తా హీరోలు కూడా తాజా ప‌రిణామాల‌పై గ‌ళం విప్పాల‌ని వాళ్లు కోరుతున్నారు.