‘పుష్ప’ హడావుడి.. సుక్కుకు నచ్చట్లేదా?

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్.. ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా ‘పుష్ప’. ఆ రెండు చిత్రాలూ నాన్ బాహుబలి హిట్లన్న సంగతి తెలిసిందే. సుక్కు, బన్నీ ఇద్దరూ కూడా తమ పతాక స్థాయిని అందుకున్నారు గత చిత్రాలతో. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరూ జత కట్టడంతోనే ‘పుష్ప’ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక టైటిల్, ఫస్ట్ లుక్ సైతం అంచనాలను ఇంకా పెంచేశాయి. హైప్ పరంగా ఈ సినిమాకు ఎలాంటి లోటు లేదు. ఇప్పటికే అన్ని ఏరియాలకూ భారీగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట.

ఐతే ఇది చాలదన్నట్లు సినిమాకు ఇంకా హైప్ పెంచేందుకు హీరో అండ్ ప్రొడ్యూసర్స్ ప్రయత్నిస్తుండటం దర్శకుడు సుకుమార్‌కు నచ్చట్లేదని అంతర్గత వర్గాల సమాచారం. మొన్న బన్నీ పుట్టిన రోజు ముంగిట టీజర్ లాంచ్ చేయడం వరకు ఓకే కానీ.. ఆ రోజు ఆ టీజర్ లాంచ్ కోసం అంత పెద్ద ఈవెంట్ చేయడం పట్ల సుక్కు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

‘పుష్ప’ టీజర్ లాంచ్ ఈవెంట్.. దాదాపుగా సినిమా విడుదల ముంగిట చేసే ప్రి రిలీజ్ ఈవెంట్లను తలపించింది. ఆ స్థాయిలో ఆడిటోరియాన్ని డెకరేట్ చేశారు. పెద్ద ఎత్తున అభిమానులను రప్పించారు. పెద్ద స్టేజ్.. యాంకర్.. ప్రసంగాలు అంటూ బాగా హడావుడి చేశారు. బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకునే ఇలా ఘనంగా ఏర్పాట్లు చేసి ఉండొచ్చు. కానీ అదొక ప్రి రిలీజ్ ఈవెంట్ లాగా మారిపోయింది. సినిమాకు ఈ దశలో ఇంత ప్రమోషన్ అవసరం లేదని.. ఓవర్ హైప్ సినిమాకు చేటు చేస్తుందని సుకుమార్ భావిస్తున్నారట.

ఐతే నిర్మాతలు హీరోను మెప్పించడానికో, లేక ఇంకా బాగా సినిమాకు బిజినెస్ చేసుకోవడానికో గానీ.. మరీ ఎక్కువ హడావుడి చేసేశారు. మరోవైపు ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేసే విషయంలోనూ సుక్కు క్లారిటీతో లేడని, ఒత్తిడికి గురవుతున్నాడని సమాచారం. నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేటుకే సినిమాను తేవాలని అనుకుంటుండగా.. అందుకోసం హడావుడి పడితే సినిమా చెడిపోతుందని సుక్కు భావిస్తున్నాడట. కొత్తగా కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కూడా పడుతున్న నేపథ్యంలో అనుకున్న తేదీకి సినిమా రావడం సందేహమే అంటున్నారు.