సుకుమార్ ఏదో మాట వ‌ర‌స‌కి అంటే..

గ‌త నెల‌లో చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజ‌రైన సుకుమార్.. అల్లు అర్జున్‌తో తాను చేస్తున్న పుష్ప సినిమా ముచ్చ‌ట్లు చెప్ప‌మ‌ని అభిమానులు అరుస్తుంటే.. సినిమా లోప‌లి ముచ్చ‌ట్లు చెప్ప‌లేక ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీకి స్టైలిష్ స్టార్ ట్యాగ్ పోతుంద‌ని.. అత‌ను మాస్ ఐకానిక్ స్టార్ అవుతాడ‌ని వ్యాఖ్యానించాడు. అప్పుడ‌ది విన‌డానికి బాగానే అనిపించింది. కానీ నిజంగా బ‌న్నీ పేరు ముందు ఆ ట్యాగ్ వేసుకుంటాడ‌‌ని ఎవ‌రూ అనుకోలేదు.

సుకుమార్ మాట వ‌ర‌సుకు అన్న మాట‌ను అంద‌రూ లైట్ తీసుకుంటార‌నే అనుకున్నారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా కొంద‌రు పీఆర్వోలు బ‌న్నీ పేరు ముందుకు మాస్ ఐకానిక్ స్టార్ తెచ్చి పెట్టేసి ట్వీట్లు వేశారు. ఇది బ‌న్నీ పీఆర్ టీం మ‌హిమ అని అంతా అనుకున్నారు. అంత‌టితో వ్య‌వ‌హారం ముగిసిన‌ట్లే అనుకుంటే.. ఈ ట్యాగ్‌ను త‌ర్వాత కూడా కొన‌సాగిస్తుండ‌టం, ఇప్పుడు అధికారికంగానే బ‌న్నీ పేరు ముందుకు ఐకాన్ స్టార్ అని వ‌చ్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇటీవ‌లే బ‌తుకు బ‌స్టాండ్ అనే సినిమా టీం నుంచి బ‌న్నీకి బ‌ర్త్ డే విషెస్ చెబుతూ.. అందులో మాస్ ఐకానిక్ స్టార్ అని ట్యాగ్ జోడించారు.

అదే టూమ‌చ్ అనుకుంటే.. ఇప్పుడు పుష్ప టీజ‌ర్లోనూ ఇదే ఒర‌వ‌డి కొన‌సాగింది. ముందు బ‌న్నీ పేరు ముందు స్టైలిష్ స్టార్ అని వేసి.. దాన్ని చెరిపేసి ఐకాన్ స్టార్ అని వేసేశారు. ఇది చూసి చాలామంది సోష‌ల్ మీడియాలో బ‌న్నీని ట్రోల్ చేస్తున్నారు. సుకుమార ఏదో మాట వ‌ర‌స‌కి అంటే.. ఇలా ఐకాన్ స్టార్ అని వేసేసుకుంటారా అని కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇంత‌కుముందు శ‌క్తి సినిమాకు తార‌క్ ఏ1 స్టార్ అని వేసుకుని అబాసుపాలైన విష‌యాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)