పింక్ 50.. నీర్కొండ పార్వై 75.. వ‌కీల్ సాబ్ 100

హిందీలో కొన్నేళ్ల కింద‌ట మంచి విజ‌యం సాధించిన సినిమా పింక్. ఇది ప‌క్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ. క‌థ మొత్తం ముగ్గురు మ‌హిళ‌ల చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక పాత్ర‌లో తాప్సి న‌టించింది. అమితాబ్ బ‌చ్చ‌న్ దాదాపు గెస్ట్ రోల్ లాంటిది చేశారిందులో. ఈ సినిమాను త‌మిళంలో నీర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు. ఒరిజిన‌ల్లో అమితాబ్ చేసిన పాత్ర‌ను ఇక్క‌డ అజిత్ చేయ‌గా.. తాప్సి క్యారెక్ట‌ర్లో శ్ర‌ద్ధ శ్రీనాథ్ క‌నిపించింది. త‌మిళంలో అజిత్ న‌టించ‌డంతో కొంచెం హీరోయిజం జోడించారు. పాత్ర‌ను పెంచారు. అక్క‌డా ఈ సినిమా మంచి విజ‌య‌మే సాధించింది.

ఇప్పుడీ చిత్రం తెలుగులో వ‌కీల్ సాబ్‌గా వ‌స్తోంది. ఇక్క‌డ హీరోయిజం, ప‌వ‌న్ పాత్ర‌ను మ‌రింత పెంచారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ లాగా తీర్చిదిద్దారు. ఐతే పింక్‌ను చెడ‌గొట్టార‌నే అనేవాళ్లూ లేక‌పోలేదు. దీనికి నిర్మాత దిల్ రాజు స‌మాధానం చెప్పారు.

వ‌కీల్ సాబ్ శుక్ర‌వారం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మీడియాను క‌లిసిన దిల్ రాజు.. పింక్ క‌న్నా, నీర్కొండ పార్వై క‌న్నా వ‌కీల్ సాబ్ బాగుంటుంద‌ని ధీమాగా చెప్పారు. పింక్‌కు 50 మార్కులు ప‌డితే.. నీర్కొండ పార్వై 75 మార్కులు ద‌క్కించుకుంటుంద‌ని.. వ‌కీల్ సాబ్‌కు అయితే ప్రేక్ష‌కులు 100 మార్కులు వేస్తార‌ని దిల్ రాజు పేర్కొన్నారు. హిందీ, త‌మిళ వెర్ష‌న్ల‌తో పోలిస్తే తెలుగు వెర్ష‌న్ ఇంకా మెరుగ్గా త‌యారైంద‌ని రాజు చెప్పారు.

అస‌లు క‌థ చెడ‌కుండానే.. ప‌వ‌న్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాను ఎంతో జాగ్ర‌త్త‌గా తీశామ‌ని దిల్ రాజు అన్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15వ నిమిషంలో స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తాడ‌ని.. ఇక అక్క‌డి నుంచి థియేట‌ర్లు మోతెక్కిపోతాయ‌ని రాజు చెప్పారు. మార్నింగ్ షో ప‌డ‌గానే వ‌కీల్ సాబ్ లెవెలే మారిపోతుంద‌ని రాజు ధీమా వ్య‌క్తం చేయ‌డం విశేషం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)