మాధవన్ రాకెట్రీ.. ఎవరీ నంబి నారాయణన్?


గురువారం సాయంత్రం నుంచి తమిళ నటుడు మాధవన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఎక్కడ చూసినా మాధవన్ గురించే చర్చ. అతను లీడ్ రోల్ చేయడమే కాకుండా.. సొంత నిర్మాణ సంస్థలో, స్వీయ దర్శకత్వంలో ‘రాకెట్రీ’ అనే సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ట్రైలర్ చూస్తే ఇదొక గొప్ప సినిమా అవుతుందన్న అంచనాలు కలిగాయి.

నంబి నారాయణనన్ అనే కేరళకు చెందిన రాకెట్ సైంటిస్ట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన కథలా అనిపించింది. మాధవన్ ఎంతో శ్రమించి, పరిశోధించి ఈ సినిమా ఈ సినిమా తీశాడని అర్థమైంది. దేశం కోసం ఎంతో చేసిన ఓ శాస్త్రవేత్త మీద దేశద్రోహి అనే ముద్ర పడితే.. దాన్ని చెరిపేసేందుకు చేసిన పోరాటం నేపథ్యంలో నడిచే కథ ఇది. ట్రైలర్ చూశాక చాలామంది నంబి నారాయణన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ నంబి నారాయణన్ ఎవరంటే?

కేరళకు చెందిన నంబి నారాయణన్… ఇస్రోలో గొప్ప క్రయోజెనిక్స్ విభాగంలో పని చేసిన రాకెట్ సైంటిస్ట్. నాసా వరకు ఆయన పేరు ప్రఖ్యాతులు వెళ్లాయి. ఆయన కోసం వివిధ దేశాలు ఎర్ర తివాచీ పరిచాయి. ఐతే గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న నంబి.. ఒక దశలో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను దేశ రహస్యాల్ని పాకిస్థాన్‌కు చేరవేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై చాలా ఏళ్ల పాటు కేసు నడిచింది. చివరికి 1998లో ఆయనపై ఆరోపణలన్నీ కొట్టివేసి నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం కోర్టు.. అతడికి జరిగిన నష్టానికి పరిహారంగా కేరళ ప్రభుత్వం రూ.50 లక్షలు నష్టపరిహారం కింద ఇవ్వాలని ఆదేశించింది. ఆ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన దాని కంటే ఎక్కువగా రూ.1.3 కోట్లు ఆయనకు పరిహారంగా ఇచ్చింది.

నంబి మీద సినిమా తీయడానికి గతంలోనూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. మాధవన్ ఈయన గురించి తెలుసుకుని కొన్నేళ్ల పాటు పరిశోధన జరిపి 2018లో ‘రాకెట్రీ’ పేరుతో సినిమా మొదలుపెట్టాడు. ముందు లీడ్ రోల్‌లో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మాధవన్.. తర్వాత దర్శకుడిగానూ మారాడు. మాధవన్ ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత, 2019లో నంబిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించడం విశేషం.