ట్విట్ట‌ర్‌కు రియ‌ల్ ప‌వర్ చూపిస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్

ట్విట్ట‌ర్లో హీరోల పుట్టిన రోజులప్పుడు, వాళ్ల సినిమాలకు సంబంధించిన విశేషాలు రిలీజైన‌పుడు.. లేదంటే పాత సినిమాల వార్షికోత్స‌వాల్ని పుర‌స్క‌రించుకుని అభిమానులు ఎంత హంగామా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వాటి మీద ఇన్ని మిలియ‌న్స్ అని టార్గెట్ పెట్టుకుని ట్వీట్లు వేస్తున్నారు.

ఐతే అభిమానులు త‌మ‌కు తాముగా ఉత్సాహంతో ట్వీట్లు వేస్తే ఓకే. కానీ క‌లెక్ష‌న్ల త‌ర‌హాలో ఈ రికార్డుల్ని కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని బోట్స్ ద్వారా ఫేక్ అకౌంట్లు త‌యారు చేయించి ట్వీట్లు వేయించే సంస్కృతి ఈ మ‌ధ్య టాలీవుడ్లో ఊపందుకుంటోంది.

కొంద‌రు హీరోల పీఆర్వోలు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ఈ వ్య‌వ‌హారాల్ని న‌డిపిస్తున్న వైనం ట్విట్ట‌ర్లో ట్రెండ్స్‌ను బ‌ట్టి స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ రికార్డుల‌కు పాత‌రేసే ప‌నిలో ప‌డ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారానికి ఎంత దూరంగా ఉంటాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్ ట్విట్ట‌ర్లో ఉన్నాడు కానీ.. త‌న సినిమాల గురించి ఒక్క మాట మాట్లాడ‌డు. అభిమానుల‌తో సినిమాల ప‌రంగా క‌నెక్ట్ కాడు. ప‌వ‌న్ కోసం సినిమా పీఆర్వోలు ప‌ని చేయ‌డం, ఫేక్ రికార్డుల కోసం వెంప‌ర్లాడ‌టం ఉండ‌దు. ప‌వ‌న్‌కు సంబంధించి ఏ హ్యాష్ ట్యాగ్ వ‌చ్చినా.. ట్విట్ట‌ర్లో సంద‌డి క‌నిపించినా.. అది నిజ‌మైన అభిమానంతో చేసేదే.

ప‌వ‌న్ కెరీర్లో మెమొర‌బుల్ ఫిలిం అయిన గ‌బ్బ‌ర్ సింగ్‌కు సోమ‌వారంతో ఎనిమిదేళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ 8yearsforgabbarsinghhystiria పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి ర‌చ్చ మొద‌లుపెట్టారు. ఆదివారం రాత్రికే దీని మీద 3 మిలియ‌న్ల ట్వీట్లు ప‌డ్డాయి. టార్గెట్ 10 మిలియ‌న్లు పెట్టుకున్నారు. రేపు రాత్రికి ఆ టార్గెట్ రీచ్ కావ‌డం క‌ష్టం కాక‌పోవ‌చ్చు. ఫేక్ అనే మాట‌కు తావు లేకుండా ఈ ల‌క్ష్యాన్ని అందుకుని ట్విట్ట‌ర్‌కు రియ‌ల్ ప‌వ‌ర్ చూపించాల‌న్న‌ది ప‌వ‌న్ ఫ్యాన్స్ ప్ర‌య‌త్నం.