సెవెంటీస్ కిడ్స్ అందరికి ఇష్టమైన పరిచయమున్న హాస్య నటుడు రాజబాబు..65 నుండి 75 వరకు స్టార్ కమెడియన్.. ఒక దశలో కృష్ణ శోభన్ బాబు హీరోలుగా బిజీ గా వున్నప్పుడు శోభన్ బాబు కృష్ణ లకు రాజబాబు వస్తేనే షూటింగ్ అనే స్థితి కూడా కొన్నాళ్ళు నడిచింది అంటే అతిశయోక్తి కాదు..
రాజబాబు ఉంటే సినిమాకెళ్లొచ్చు అనే ప్రేక్షకులు కూడా ఉండేవారు అప్పట్లో.. రాజబాబు 9గంటలకు షూటింగ్ అంటే 7. 30కి తయారయ్యి పాండీ బజార్ వెళ్లి అక్కడ తన పాతమిత్రులందరినీ కలిసి (తనతో పాటు మద్రాసు వచ్చి అవకాశాలు లేక ఖాళీ గా వున్న సత్తిబాబు.. చిడతల అప్పారావ్.. ఇలా మరికొందరు).. శాంతభవన్ హోటల్లో అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేసి బిల్లు కట్టి వారికి కావాల్సిన లంచ్ కి కూడా డబ్బులిచ్చి అప్పుడు షూటింగ్ కి వెళ్ళేవాడు..
దాసరి నారాయణరావు గారి మొదటి సినిమా తాతా మనుమడు లో రాజబాబే హీరో.. ఆ సినిమా పబ్లిసిటీ లో ఒక గమ్మత్తైన పోస్టర్ వేశారు.. అదేమిటంటె “నవ్వించే రాజబాబు ఏడిపించటం వెరైటీ.. ఏడిపించే గుమ్మడి నవ్వించడం వెరైటీ అని.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. దాసరికి బలమైన పునాది వేసింది.. తర్వాత దాసరి దర్సకత్వం లోనే తిరుపతి అనే సినిమా తీశారు.. తర్వాత రాజబాబు స్వయంగా తను హీరోగా మరికొన్ని సినిమాలు చేసాడు.. సర్కార్ ఎక్ష్ప్రెస్స్.. ఇల్లు ఇల్లాలు లాంటి సినిమాలలో రాజబాబుదే పైచేయి అన్నట్టుగా ఉండేవి.. మనిషి రోడ్డున పడ్డాడు.. ఓ మనిషీ తిరిగిచూడు..ఎవరికివారే యమునాతీరే మొదలగు సినిమాలలో రాజబాబు హీరో గా నటించాడు.. మంచి పేరు తెచ్చుకున్న సినిమాలుగా మిగిలిపోయాయి గానీ ఆర్ధికంగా నష్టాల్నే మిగిల్చాయి..
నటుడిగా వేషాలు వేస్తున్నప్పటికే 80లలోకి వచ్చేసరికి అవకాశాలు తగ్గాయి..రోజుకి 18 గంటలు పని చేసి ఖాళీగా ఉండాలంటే అది ఓక శాపం లాంటిది.. అందుకని తనకి బాగా తెలిసిన నిర్మాతలకు దర్సకులకు ఫోన్ చేసి నేను మీ సినిమాలో ఉండాల్సిందే అని డిమాండ్ చేసేవాడు.. వారు కూడా కాదనకుండా తమ సినిమాలో ఎదో ఒక క్యారక్టర్ సృష్టించేవారు.. ఆలా వేసిన వేషాల్లో ఒకటి అల్లూరి సీతారామరాజు లో పోలీస్ ఇన్స్పెక్టర్.. స్టేషన్ ఇన్చార్జ్.. సీతారామరాజు వచ్చినప్పుడు ఆయుధాలన్నీ రామరాజు కి అప్పజెప్పుతాడు.. తర్వాత కూడా రెండు సీన్స్ క్రియేట్ చేసి రామరాజు స్థావరానికి వచ్చే సీన్స్ ఉంటాయి..తరవాత మరికొన్ని సినిమాలు చేసాడు.. నేను అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన భోగిమంటలు సినిమాకి త్రిపురనేని మహారథి గారు రచయిత.. ఆయనకి ఫోన్ చేసి “బాబాయ్.. నేను మీ సినిమాలో లేకపోతె అవమానం నాకు కాదు.. మీకే.. మీకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను.. కాబట్టీ నేను మీ సినిమాలో వుండేలాచేసుకోండి” అని ఆర్డర్ వేసాడు..
మహారథి గారికి కూడా రాజబాబు అంటే చాలా ఇష్టం.. అప్పలాచార్య ని పిలిపించి జయమాలిని.. నూతన్ ప్రసాద్.. రాజబాబు ల మీద ఒక కామెడీ ట్రాక్ రాయించారు.. షూటింగ్ అయిపోయింది.. డబ్బింగ్ చెప్పటానికి వచ్చాడు రాజబాబు.. ఆర్టిస్ట్ డబ్బింగ్ కి రాగానే బ్రేక్ ఫాస్ట్ ఆరెంజ్ చేసి కాఫీ ఇచ్చి వారికి సిగిరెట్ తాగే అలవాటు ఉంటే ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ సిగిరెట్ ప్యాకెట్ కూడా ఇచ్చేవారు ఒక అగ్గిపెట్టె తో సహా.. రాజబాబు అంతకుముందు త్రిబుల్ ఫైవ్ కాల్చేవాడు.. తరవాత కాప్స్టన్ కింగ్ సైజ్ కి బ్రాండ్ మార్చుకున్నాడు.. ఏం సిగరెట్ సార్ అని ప్రొడక్షన్ అసిస్టెంట్ అడిగితె క్యాప్స్టన్ కింగ్ సైజ్ అని చెప్పారు.. కుర్రవాడు ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు..వెంటనే రాజబాబు తన జేబులో వున్న సిగిరెట్ ప్యాకెట్ బయటకు తీసి ఓపెన్ చేసి చూసాడు.. అందులో ఏడు సిగరెట్లు వున్నాయి.. నా వైపు చూసి నువ్వు సిగెరెట్ కలుస్తావు కదూ అన్నాడు.. నేను మొహమాటంగా కాదన్నట్టు అడ్డంగా తల ఊపాను.. ఏయ్ దొంగ.. నీ పెదాలు నల్లగా వున్నాయ్.. నువ్వు సిగిరెట్ కాలుస్తావు నాకు తెలుసు అని తనదైన శైలిలో నవ్వి ఆ ప్యాకెట్ నా జేబులో పెట్టి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన సిగిరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి దానిలోనుంచి ఒక సిగిరెట్ తీసి వెలిగించి సిగిరెట్ అయ్యాక లోపలికి వెళ్లి డబ్బింగ్ చెప్పుకుందాము అని సిగిరెట్ ఫినిష్ అయ్యాక లోపలికి వచ్చి డబ్బింగ్ చెప్పడు…దట్ ఈస్ రాజబాబు.. పుణ్యమూర్తుల అప్పలరాజు…
— శివ నాగేశ్వర రావు