కార్తీక్‌కు జెస్సీ ఫోన్ చేస్తే..

తెలుగు, త‌మిళ సినీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన ప్రేమ‌క‌థ‌ల్లో ఏమాయ చేసావె (త‌మిళంలో విన్నైతాండి వ‌రువాయె) ఒక‌టి. గీతాంజ‌లి త‌ర‌హాలో దీన్ని మోడ‌ర్న్ క్లాసిక్‌గా చెప్పుకోవ‌చ్చు. అందులో కార్తీక్, జెస్సీ పాత్ర‌ల్ని ప్రేక్ష‌కులు అంత సులువుగా మ‌రిచిపోలేరు. అవి సినిమా పాత్ర‌ల్లా కాకుండా నిజంగానే అలాంటి వ్య‌క్తులున్న‌ట్లు ఫీల‌య్యేలా చేస్తుందా సినిమా.

ఈ చిత్రాన్నో దృశ్య కావ్యంలా మ‌లిచాడు గౌత‌మ్ మీన‌న్. ఐతే తెలుగు వెర్ష‌న్‌తో పోలిస్తే త‌మిళంలో ఈ సినిమా క్లైమాక్స్ భిన్నంగా ఉంటుంది. అందులో హీరో, హీరోయిన్ క‌ల‌వ‌రు. జెస్సీ వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది.

మ‌న వాళ్లు సినిమాను అలా ముగిస్తే ఒప్పుకోర‌ని నిర్మాత మంజుల చెప్ప‌డంతో గౌత‌మ్ సుఖాంతం చేశాడు. కానీ త‌మిళంలో మాత్రం ముగింపు హృద‌యాల్ని మెలిపెడుతుంది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డా సినిమా మంచి విజ‌యాన్నందుకుంది.

ఐతే లాక్ డౌన్ టైంలో ఈ సినిమాతో ముడిపెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు గౌత‌మ్ మీన‌న్. దాని పేరు.. కార్తీక్ డ‌య‌ల్ సెయ్‌దా యెన్. నిజంగా కార్తీక్ అనే వాడు ఉంటే.. ఈ లాక్ డౌన్ టైంలో ఏం చేస్తుంటాడు.. ఇప్పుడు అత‌డి జీవితం ఎలా ఉంటుంది అన్న‌ది ఇందులో చూపించ‌బోతున్నారు.

దీనికి ఒక టీజ‌ర్ కూడా వ‌దిలారు. విన్నైతాండి వ‌రువాయ హీరోయిన్ త్రిష మీద ఆ టీజ‌ర్ చిత్రీక‌రించ‌డం విశేషం. జెస్సీ ఇప్పుడు కార్తీక్‌కు ఫోన్ చేసి త‌న సినిమా కెరీర్‌ గురించి వాక‌బు చేస్తున్న‌ట్లుంది ఈ వీడియో.

లాక్ డౌన్ గురించి భ‌య‌ప‌డొద్ద‌ని, మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయ‌ని, ప్ర‌స్తుతానికి అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివి ఉన్నాయ‌ని.. నీ ద‌గ్గ‌ర మంచి కంటెంట్ ఉంది కాబ‌ట్టి భ‌యం లేద‌ని జెస్సీ కార్తీక్‌కు ధైర్యం చెబుతోందీ వీడియోలో. త్వ‌ర‌లోనే షార్ట్ ఫిల్మ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నాడు గౌత‌మ్. మ‌రి అందులో అత‌నేం చూపించ‌బోతున్నాడో?