టీజర్ టాక్: తమన్నా షాకులేమీ ఇవ్వలేదే

టీజర్ టాక్: తమన్నా షాకులేమీ ఇవ్వలేదే

బడా బడా హీరోయిన్లు ఒక్కొక్కరుగా డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోతున్నారు. సమంత రెండేళ్ల కిందటే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను ఓకే చేసింది. కాకపోతే కరోనా వల్ల ఈ సిరీస్ చిత్రీకరణ ఆలస్యమైంది. విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. ఐతే ఇందులో సమంత పాత్ర మీద అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఆమె ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో చేసింది టెర్రరిస్టు పాత్ర కావడం విశేషం.

ఈ పాత్రకు కావాల్సినంత హైప్ వచ్చింది. మరో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే ‘లైవ్ టెలికాస్ట్’ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ డెబ్యూ చేసింది. అది జస్ట్ ఓకే అనిపించింది. ఆమె పాత్రకు ఏమంత మంచి గుర్తింపు రాలేదు. ఇక మరో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ చేసిన ‘పిట్టకథలు’లో తన ఎపిసోడ్ ఏమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఇప్పుడిక తమన్నా డిజిటల్ అరంగేట్రానికి రెడీ అయింది.

తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెంత్ అవర్’ అనే సిరీస్ తెరకెక్కింది. ‘ఆహా’ ఓటీటీలో ఇది ప్రసారం కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు. పురుషాధిక్య ప్రపంచంలో ఓ మహిళ ఓ కార్పొరేట్ కంపెనీని నడపడంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి.. అడుగడుగునా అడ్డంకులు, అవమానాల మధ్య వాటిని ఆమె ఎలా అధిగమించింది అనే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మహిళా సాధికారత ఇందులో ప్రధానాంశంగా కనిపిస్తోంది.

నిజానికి తమన్నా-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు థ్రిల్లర్ ఆశించారు. డిజిటల్ డెబ్యూలో చాలామంది హీరోయిన్లు థ్రిల్లింగ్ కథాంశాలనే ఎంచుకుంటారు. కానీ తమన్నా మాత్రం సినమాల్లో చూసే సోషల్ డ్రామా కథాంశానికి ఓటేసింది. ప్రేక్షకులు ఆశించే థ్రిల్స్ కానీ.. సర్ప్రైజ్‌లు కానీ.. షాకులు కానీ ఇందులో ఏమీ కనిపించలేదు. వెబ్ సిరీస్‌ల్లో ఈ జానర్‌ పట్ల ప్రేక్షకులను ఆకర్షించడం అంత తేలిక కాదు. మరి ఈ సిరీస్ ఏమేర ఆదరణ పొందుతుందో చూడాలి.