శ్రుతి హాస‌న్‌తో హ‌రీష్ శంక‌ర్ రొమాన్స్ చేస్తే..

ఇందులో వ‌క్ర భాష్యాలేమీ లేవు. ఈ రోజు ట్విట్ట‌ర్లో క‌నిపించిన ఒక ఫొటోకు ఇది వ్యాఖ్య అనుకోండి. కావాలంటే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌కు వెళ్లి.. ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు బ‌దులుగా ఆయ‌న పంచుకున్న పాత ఫొటోలు చూడండి. అందులో శ్రుతి హాస‌న్.. హ‌రీష్ శంక‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న‌ట్లే ఉంది.

ఇదంతా గ‌బ్బ‌ర్ సింగ్ సెట్లో హ‌రీష్ శంక‌ర్ ఓ స‌న్నివేశాన్ని చేసి చూపిస్తున్న త‌రుణంలో తీసిన ఫొటోలు. ఆ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ చాలా స్పెష‌ల్‌గా ఉంటుందంటూ ఆ సన్నివేశాన్ని వ‌ర్ణిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు ఓ నెటిజ‌న్. ఇది వ‌న్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇన్ తెలుగు సినిమా అంటూ అత‌ను వ్యాఖ్యానించాడు. దీంతో హ‌రీష్ శంక‌ర్ ఎగ్జైట్ అయ్యాడు.

ఆ స‌న్నివేశం తీస్తున్న స‌మ‌యంలో ఆన్ లొకేష‌న్ పిక్స్ షేర్ చేశాడు. అందులో ప‌వ‌న్‌, శ్రుతిల‌కు హ‌రీష్ సన్నివేశం వివ‌రిస్తున్నాడు. హావ‌భావాలు ఎలా ఉండాలో త‌నే చేసి చూపిస్తున్నాడు. అందులో హ‌రీష్ చేతి మీది నుంచి శ్రుతి వెన‌క్కి వాలిన‌ట్లుగా ఉన్న పొటో ఉంది. మ‌రో ఫొటోలో హ‌రీష్ స‌న్నివేశాన్ని వివ‌రిస్తుంటే ప‌వ‌న్ ఆహ్లాద‌క‌ర రీతిలో న‌వ్వుతూ చూస్తున్నాడు.

ఎనిమిదేళ్ల పాటు స‌రైన హిట్ లేక ప‌వ‌న్, ఆయ‌న అభిమానులు ఇబ్బంది ప‌డుతున్న త‌రుణంలో హిందీ హిట్ ద‌బంగ్‌ను గ‌బ్బ‌ర్ సింగ్‌గా రీమేక్ చేసి మ‌ర‌పురాని స‌క్సెస్ అందించాడు హ‌రీష్‌. ఆద్యంతం హుషారెత్తిస్తూ, ఉర్రూతూల‌గిస్తూ సాగిన ఈ సినిమా ప‌వ‌న్ అభిమానులు ఆక‌లిని తీర్చేసింది.

అప్ప‌టి వాళ్ల ఎగ్జైట్‌మెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమా వ‌చ్చి సోమ‌వారంతో ఎనిమిదేళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం నుంచే ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌ను హోరెత్తిస్తున్నారు.