పవన్ నుంచి మరో నాటు పాట


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగీతాభిరుచి గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి తాను చేసే సినిమాల సంగీత చర్చల్లో అతను భాగవమవుతూ వస్తున్నాడు. తన అభిరుచికి తగ్గట్లు పాటలు చేయించుకోవడం.. మనం మరిచిపోతున్న జానపదాలను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం చేయడం.. పాటల మేకింగ్‌లో పాలు పంచుకోవడం ద్వారా పవన్ తన అభిరుచిని చాటుకుంటూనే వస్తున్నాడు.

తాను దర్శకత్వం వహించిన ‘జానీ’ సినిమాలో పవన్ కొన్ని జానపదాలను స్వయంగా ఆలపించడమూ తెలిసిందే. ‘ఖుషి’లో సైతం పవన్ నోటి నుంచి జానపదాలు జాలువారాయి. చివరగా పవన్ గొంతు సవరించుకున్నది ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం. అందులో ఆయన పాడిన ‘కొడకా కోటేశ్వర్రావు’ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. సినిమా డిజాస్టర్ కావడం వల్ల ఆ పాట మరుగున పడిపోయింది. అంతకుముందు ‘అత్తారింటికి దారేది’లో పవన్ పాడిన ‘కాటమరాయుడా..’ పాట అయితే ఒక ఊపు ఊపేసింది.

కొంచెం గ్యాప్ తర్వాత పవన్ ఇప్పుడు మళ్లీ ఓ పాట అందుకోబోతుండటం విశేషం. ఈసారి పవన్‌తో పాడిస్తున్నది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కావడం గమనార్హం. పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో పాటు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌కు కూడా తమనే సంగీతం సమకూర్చనున్న సంగతి తెలిసిందే.

‘వకీల్ సాబ్’కు అదిరిపోయే పాటలతో సినిమాకు హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడంతో.. తన తర్వాతి చిత్రానికి కూడా తమన్‌నే ఎంచుకున్నాడు పవన్. ఈ సినిమాలో తాను పవర్ స్టార్‌తో పాట పాడించబోతున్నట్లు ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా తమన్ వెల్లడించాడు. ఈ పాట పవన్ శైలిలోనే ఉంటుందని, అభిమానులను అలరిస్తుందని తమన్ తెలిపాడు. ఈ చిత్రంలో పవన్ చేస్తున్న పాత్రను బట్టి చూస్తుంటే.. ఆయన మరోసారి జానపద గేయాన్నే ఆలపించే అవకాశాలున్నాయి. ఒరిజినల్‌గా పోలిస్తే ఈ పాత్రలో సీరియస్‌నెస్ కొంచెం తగ్గించి, ఎంటర్టైన్మెంట్ పెంచుతున్నారట. ఈ క్రమంలోనే పవన్‌తో ఓ పాట కూడా పాడిస్తున్నట్లు తెలుస్తోంది.