విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న బిగ్ బాస్ కాన్సెప్ట్ ఇండియాలో కూడా సూపర్ హిట్టయింది. హిందీలో ఈ షో దశాబ్దంన్నర నుంచి విజయవంతంగా రన్ అవుతోంది. ప్రతి ఏటా దాని స్థాయి పెరుగుతోంది. అక్కడ హోస్ట్‌లుగా దాదాపు అరడజను మంది చేశారు. ఐతే ఎక్కువగా షోను నడిపించిందైతే సల్మాన్ ఖానే. ఇటీవలే అతను బిగ్ బాస్ హోస్ట్‌గా 11 సీజన్లు పూర్తిచేసుకున్నాడు.
బిగ్ బాస్ షో కొన్నేళ్ల కిందటే దక్షిణాదిన కూడా అడుగు పెట్టగా.. తెలుగులో వరుసగా మూడు సీజన్లలో ముగ్గురు హోస్ట్‌లను చూశాం. కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో కమల్ హాసన్ మాత్రం మొదట్నుంచి ఈ షోలను నడిపిస్తున్నారు. ఏ మార్పూ లేదు. కమల్ ఇటీవలే నాలుగో సీజన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అక్కడ ఈ షో సూపర్ హిట్ కావడంలో ఆయన పాత్ర కీలకం.
ఐతే కమల్‌ను తమిళ ప్రేక్షకులు తర్వాతి సీజన్‌కు బిగ్ బాస్ హోస్ట్‌గా చూడలేమన్నది తాజా సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉన్న కమల్.. ఆ తర్వాత విక్రమ్, ఇండియన్-2 సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత కూడా పార్టీ బాధ్యతలు చూడాల్సి ఉంది. తాను బిగ్ బాస్ షో మీద ఆసక్తి కంటే.. తాను కొత్తగా పెట్టే పార్టీని నడపడానికి అవసరమైన నిధుల కోసం ఈ షోను హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు కమల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
ఐదో సీజన్ నుంచి అయితే షోలో పాల్గొనే ఉద్దేశాలు ఆయనకు లేవట. కమల్ స్థానంలోకి స్టార్ హీరో శింబు రాబోతున్నట్లుగా అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే శింబుకు అంత మంచి స్పీకర్‌గా ఏమీ పేరు లేదు. వ్యక్తిగా కూడా అతడికి మంచి ఇమేజ్ లేదు. వివాదాల వీరుడిగా పేరుంది. అతను కమల్ స్టేచర్‌ను మ్యాచ్ చేయగలడా.. ఆయనలా హుందాగా షోను నడిపించగలడా అన్నది సందేహం.
Gulte Telugu Telugu Political and Movie News Updates