ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అల్లు అర్జున్-సుకుమార్‌ల కొత్త సినిమా ‘పుష్ప’లో విలన్ ఎవరో తేలిపోయింది. దాదాపు ఏడాది చర్చ తర్వాత ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు సుకుమార్. మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఆ పాత్రకు ఓకే చేశాడు సుక్కు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవలే సుకుమార్ కేరళకు వెళ్లి నేరుగా ఫాహద్‌ను కలిసి కథ, తన పాత్ర గురించి చెప్పి ఈ సినిమాకు ఒప్పించాడు.
మంచి విషయం ఉన్న పాత్ర కావడం.. అలాగే తమ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునే రావడం.. అలాగే తెలుగులో అడుగు పెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి రాదన్న ఉద్దేశంతో ఫాహద్ ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నాడు సుక్కు. మొదట అతను ఓకే అన్నాడు కానీ, తర్వాత డేట్లు సర్దుబాటు చేయలేకో మరో కారణంతోనో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. తర్వాత బాబీ సింహా, అరవింద్ స్వామి, బాబీ డియోల్.. ఇలా ఈ పాత్రకు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాళ్లెవ్వరూ కాకుండా చివరికి ఫాహద్‌ను ఈ పాత్రకు ఓకే చేశాడు సుక్కు. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ.. సరైన నటుడినే ‘పుష్ప’ విలన్ పాత్రకు ఎంపిక చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫాహద్ ఫాజిల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఈ మధ్య తెలుగులో అనువాదమై ఆహాలో విడుదలైన ‘ట్రాన్స్’ సినిమా చూస్తే అతడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ‘తొండిముదలుమ్ దృక్సక్షియుం’, ‘కుంబలంగి నైట్స్’ లాంటి సినిమాల్లో అతడి నటన చూసి ఫిదా అవ్వకుండా ఉండలేం. అతను జాతీయ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నాడు. చూడ్డానికి మామూలుగా కనిపిస్తాడు కానీ.. కేవలం కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించగలడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అతను ఇంకా గొప్పగా నటిస్తాడు.
‘పుష్ప’లో అతడి పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుందంటున్నారు. సుకుమార్ సినిమాలో బన్నీ ముందు ఇలాంటి నటుడుంటే.. కన్‌ఫ్రంటేషన్ సీన్లు భలేగా పండే అవకాశముంది. ఫాహద్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో కేరళ, తమిళనాడుల్లో భారీగా రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మొత్తానికి సుకుమార్ ఫాహద్‌ను ఎంపిక చేయడం మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి.