కొన్ని సార్లు కొన్ని సినిమాలకు మంచి టాక్ వస్తుంది. ‘మంచి సినిమా’ అన్న పేరొస్తుంది. రివ్యూలు బాగుంటాయి. సోషల్ మీడియాలో జనాలందూ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. అయినా సరే.. జనాలు వాటిని ఆశించిన స్థాయిలో ఆదరించరు. ఈ కోవలోకే చేరేలా కనిపిస్తోంది ‘శ్రీకారం’ చిత్రం. శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ రూపొందించిన చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద బేనర్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ పాజిటివ్‌గా కనిపించింది. పాటలు బాగున్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాకు రిలీజ్ ముంగిట డీసెంట్ బజ్ కనిపించింది. రిలీజ్ రోజు రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. వ్యవసాయం చుట్టూ నడిచే ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. దాన్ని చాలా హృద్యంగా చెప్పారు. కమర్షియల్ హంగులు కూడా బాగానే జోడించారు. అన్నీ బాగున్నా కానీ సినిమాకు వసూళ్లు మాత్రం లేవు.
‘జాతిరత్నాలు’తో పోటీ పడటం ‘శ్రీకారం’ చిత్రానికి చేటు చేసిందనడంలో సందేహం లేదు. ‘శ్రీకారం’తో పోలిస్తే అది చిన్న సినిమానే కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ పెద్ద సినిమా స్థాయిలో సత్తా చాటుతోంది. మంచి ఎంటర్టైనర్ అయిన ఆ సినిమా చూడ్డానికే ప్రేక్షకులు ఎగబడుతున్నారు. వీకెండ్లోనే ‘శ్రీకారం’కు సరైన ఆక్యుపెన్సీ లేకపోయింది. శని, ఆదివారాల్లో కూడా హౌస్ ఫుల్స్ పడలేదు. ఆక్యుపెన్సీ మరీ తక్కువగా ఉండటం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడలేదు.
అందుబాటులో మంచి ఎంటర్టైనర్ ఉండటంతో సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ ‘శ్రీకారం’ వైపు చూడట్లేదని అర్థమవుతోంది. ఫ్యామిలీస్ కొంతమేర వీకెండ్లో ఈ సినిమాను చూశాయి. రూ.16 కోట్ల షేర్ రాబడితే కానీ ‘శ్రీకారం’ బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ వీకెండ్లో రూ.10 కోట్ల షేర్ కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. వారాంతం అయ్యాక వసూళ్లు మరింత తగ్గుముఖం పడుతుండగా.. వచ్చే శుక్రవారం మూడు కొత్త చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ‘శ్రీకారం’ బయ్యర్లను గట్టి దెబ్బే తీసేలా కనిపిస్తోంది.