అల్లు అర్జున్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియా కింగ్ అని అభివర్ణిస్తుంటారు. పీఆర్ టీంను మెయింటైన్ చేయడంలో, సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకోవడంలో, అక్కడ ఫాలోయింగ్ పెంచుకోవడంలో బన్నీకి బన్నీనే సాటి అని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటుంటారు. హీరోగా బన్నీ పడే కష్టం, అతడి పెర్ఫామెన్స్, సినిమాల ఎంపిక.. ఇలాంటి విషయాల్లో తిరుగులేదు కానీ, బయట బన్నీ తీరు, ఆయా సందర్భాల్లో అతడికి పీఆర్ టీం ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసే విధానం మాత్రం కొంత అభ్యంతరకరగానే ఉంటుంది.
దీని మీద సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతుంటుంది. ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ దగ్గర్నుంచి మెగా అభిమానుల నుంచే అతను వ్యతిరేకత ఎదుర్కొంటూ వచ్చాడు. అలాగే ఎదిగే దశలో ‘మెగా’ బ్రాండును బాగా వాడుకుని ఈ మధ్య ‘అల్లు’ బ్రాండుకు మాత్రమే ఎలివేషన్ ఇస్తుండటమూ ఓ వర్గానికి నచ్చట్లేదు.
ఇదిలా ఉంటే సినిమా వేడుకల్లో బన్నీ ప్రసంగాలు.. ఆ సమయాల్లో సభా ప్రాంగణంలో అతడి అభిమానుల హంగామా సైతం చర్చనీయాంశం అవుతుంటుంది. తాజాగా బన్నీ ముఖ్య అతిథిగా హాజరైన ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఓ పరిణామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బన్నీ కోసం అభిమానులు పైకి రావడం.. అతడి మీద పడిపోవడం.. బన్నీ వాళ్లనేమీ అనొద్దు అంటూ వారించడం.. ఇదంతా కూడా ఒక సెటప్ లాగా అనిపించింది జనాలకు.
అనుకోకుండా జరిగిన పరిణామంలా కాకుండా.. బన్నీ క్రేజ్ చూపించడానికి ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులను బన్నీ బౌన్సర్లే పైకి తీసుకురావడం.. అదే సమయంలో కింద ఒక బ్యాచ్ ముందుకొచ్చి బన్నీని ఫొటోలు తీయడానికి ప్రయత్నించడం.. ఇదంతా సహజంగా జరిగినట్లయితే అనిపించలేదు. గతంలోనూ కొన్నిసార్లు అభిమానులు వేదిక మీదికి రావడం, వాళ్లనేమీ అనొద్దని బన్నీ వారించడం జరిగాయి. ఈసారి మాత్రం పనిగట్టుకుని ఇలా చేయించినట్లు అనిపించడంతో బన్నీ అండ్ టీమ్ మీద సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు పేలుతున్నాయి. మీమ్స్ పడుతున్నాయి.