కోలీవుడ్‌లో ఒక ఆసక్తికర, క్రేజీ కాంబినేషన్లో సినిమా మొదలైంది. సీనియర్ కథానాయకుడు విక్రమ్, అతడి కొడుకు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం బుధవారమే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సినిమాను విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా సిమ్రాన్ నటిస్తుండటం గమనార్హం. సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నాడు. విక్రమ్, ధ్రువ్ కలయికలో సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య బాల దర్శకత్వంలో మొదలైన ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వెర్షన్ ‘వర్మ’ ఔట్ పుట్ తేడా కొట్టడంతో దాన్ని పక్కన పడేయడం.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్యతో ‘ఆదిత్య వర్మ’ను తీయడం.. ఆ చిత్రం ఏడాదిన్నర కిందట విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ధ్రువ్ హీరోగా మరో సినిమా ఏదీ మొదలు కాలేదు. తండ్రితో కలిసి చేస్తున్నదే అతడి రెండో సినిమా. విక్రమ్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం.
కార్తీక్ దర్శకత్వంలో విక్రమ్, ధ్రువ్ నటిస్తుండటంతో వీరి పాత్రలు ఎంత కొత్తగా, సంచలనాత్మకంగా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి తెరపై తండ్రీ కొడుకులుగా నటిస్తారా.. లేదా ఇద్దరి మధ్య వైరాన్ని చూపిస్తారా అన్నది ఆసక్తికరం. విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులోనూ రిలీజైన ‘డిమాంటి కాలని’, ‘అంజలి ఐపీఎస్’ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విక్రమ్ ఇందులో బహుముఖ పాత్రలు చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.