కాన్సెప్ట్ పోస్టర్.. హెబ్బా సెన్సేషన్

కెరీర్లో ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లతోనే పేరు సంపాదించింది హెబ్బా పటేల్. కథానాయికగా తొలి చిత్రం ‘అలా ఎలా’లో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత ‘కుమారి 21 ఎఫ్’ లాంటి బోల్డ్ సినిమాతో ఆశ్చర్యపరిచింది. ఆ దెబ్బతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయడంతో హెబ్బ కెరీర్ తిరోగమనంలో పయనించింది.

ఒక దశలో ఆమె ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి కూడా కనిపించింది. కానీ మళ్లీ ఈ మధ్య హెబ్బా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వ్యాంప్ క్యారెక్టర్లు, ఐటెం సాంగ్స్‌తో మళ్లీ ప్రేక్షకుల దృష్టిలో పడ్డ హెబ్బా.. ఇప్పడు రూటు మారుస్తోంది. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ప్రయోగాత్మక పాత్రల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే సంపత్ నంది కథతో తెరకెక్కుతున్న ‘ఓదెల రైల్వే స్టేషణ్’ సినిమాలో హెబ్బా పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామరస్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హెబ్బా లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు హెబ్బా మరో డిఫరెంట్ రోల్‌కు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో ‘తెలిసిన వాళ్లు’ అనే వెరైటీ టైటిల్‌తో ఓ కొత్త సినిమా రానుంది. విప్లవ్ కోనేటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సైరీన్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేశారు. అది ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా సంచలనాత్మకంగా ఉంది.

పాత కాలం నాటి మడత కుర్చీలో కూర్చున్న అమ్మాయికి తల లేదు అందులో. పక్కన ఫొటోలో ఆ అమ్మాయి తల ఉంది. అది హెబ్బా పటేల్‌ది. ఈ పోస్టర్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్నది క్లియర్‌గా తెలియట్లేదు కానీ.. ఇది హార్రర్ టచ్ ఉన్న సినిమాలా అయితే అనిపిస్తోంది. ‘తెలిసిన వాళ్లు’ అనే టైటిల్ పెట్టడాన్ని బట్టి.. తెలిసిన వాళ్ల చేతిలో మోసపోయిన అమ్మాయి కథ ఇదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో అయితే ఈ ఫస్ట్ లుక్ విజయవంతమైంది. ఈ చిత్రంలో రామ్ కార్తీక్ కీలక పాత్ర చేస్తున్నాడు.