ప్ర‌భాస్ సినిమా.. మ‌రో ప్ర‌పంచంలో

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌, న‌టించ‌బోయే చిత్రాల్లో అమితాస‌క్తిని రేకెత్తిస్తున్న‌ది నాగ్ అశ్విన్‌తో చేయ‌బోయే సినిమానే అంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే.. మ‌హాన‌టి లాంటి గొప్ప సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ తీయ‌బోయే చిత్ర‌మిది. పైగా వైజ‌యంతీ మూవీస్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏకంగా రూ.400 కోట్ల బ‌డ్జెట్ పెడుతోందీ చిత్రానికి. అలాగే ఆదిత్య 369 త‌ర‌హాలో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా, హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ సినిమాను తీర్చిదిద్ద‌నున్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇండియ‌న్ సినిమాలో ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంద‌నే అంచ‌నాలు దీనిపై ఉన్నాయి. ఈ సినిమా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఊరిస్తూ.. కొత్త క‌బుర్లు చెబుతూనే ఉన్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. తాజాగా త‌న నిర్మాణంలో తెర‌కెక్కిన జాతిర‌త్నాలు ప్ర‌మోష‌న్ కోసం మీడియాను క‌లిసిన అశ్విన్‌.. ప్ర‌భాస్‌తో చేయ‌బోయే సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు.

ప్ర‌భాస్‌తో తాను చేయ‌నున్న సినిమాను గ‌త ఏడాది జూన్‌లోనే మొద‌లుపెట్టాల‌ని ముందు అనుకున్న‌ట్లు నాగి వెల్ల‌డించాడు.కానీ క‌రోనా వ‌ల్ల కొంత ఆల‌స్య‌మైతే.. ప్రి ప్రొడ‌క్ష‌న్‌కు చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో ఇంకా లేటుగా సినిమాను మొదలు పెడుతున్నామ‌ని చెప్పాడు. ఏడాదికి పైగా ఈ సినిమాకు ప్రి ప్రొడ‌క్ష‌న్ కోస‌మే కేటాయిస్తున్నామ‌ని.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాల్సి ఉంద‌ని నాగి తెలిపాడు.

మ‌హాన‌టి సినిమాలో వాడిన పాత కార్లు లాంటివి తెప్పించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని.. కానీ ప్ర‌భాస్‌తో తాను చేయ‌బోయే సినిమాలో వాడే వాహ‌నాలు ఎక్క‌డా దొర‌క‌వ‌ని.. వాటిని ప్ర‌త్యేకంగా త‌యారు చేయిస్తున్నామ‌ని నాగి తెలిపాడ. వాహ‌నాలు అనే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తిదీ ఆర్ట్ డిపార్ట్ మెంట్ త‌యారు చేయిస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ సినిమా స్క్రిప్ట్ స‌హా ప్ర‌తిదీ కొత్త‌గానే ఉంటుంద‌ని.. ప్రేక్ష‌కుల‌ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్తామ‌ని నాగి చెప్పాడు.. ఈ ఏడాది జూన్-జులై నెల‌ల్లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొద‌లుపెట్టాల‌నుకుంటున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)