దివంగ‌త ‌ద‌ర్శ‌కుడి కొడుకుపై టాలీవుడ్ ప్రేమ‌

టాలీవుడ్లోకి చాలామంది వార‌స‌త్వ హీరోలొచ్చారు. కానీ అంద‌రూ ఏమీ నిల‌బ‌డిపోలేదు. కెరీర్ ఆరంభంలో స్ట్ర‌గులైన హీరోల‌ను నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నించి ప్ర‌య‌త్నించి ఇక వ‌ల్ల కాద‌ని వాళ్ల‌ను వ‌దిలేసిన వాళ్లూ ఉన్నారు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ అన్నిసార్లూ బ్యాక‌ప్ ల‌భించ‌దు. అలాంటిది తెలుగులో చాలా త‌క్కువ సినిమాలే చేసిన, హ‌ఠాత్తుగా క‌న్నుమూసిన ఒక ద‌ర్శ‌కుడి కొడుకును హీరోగా నిల‌బెట్ట‌డానికి టాలీవుడ్లో కొంద‌రు ప్ర‌ముఖులు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు.

ఆ ద‌ర్శ‌కుడు శోభ‌న్ కాగా.. హీరోగా నిల‌దొక్కుకునేందుకు క‌ష్ట‌ప‌డుతున్న అత‌డి కొడుకు పేరు సంతోష్ శోభ‌న్. గోల్కొండ హైస్కూల్ సినిమాలో స్కూల్ కుర్రాడి పాత్ర‌లో ప్ర‌తిభ చాటుకున్న సంతోష్ శోభ‌న్‌.. ఆ త‌ర్వాత త‌ను నేను అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ చిత్రం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్క‌డం విశేషం. ఉయ్యాల జంపాల నిర్మాత‌ రామ్మోహ‌న్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కానీ అది సంతోష్ ఆశించిన ఆరంభాన్నివ్వ‌లేదు.

ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది నిర్మాణంలో పేప‌ర్ బాయ్ అనే సినిమా చేశాడు సంతోష్‌. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయ‌డం విశేషం. కానీ అది కూడా ఆడ‌లేదు. ఈసారి చాలా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నాడు సంతోష్‌. అత‌ను హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం పేరు.. ఏక్ మినీ క‌థ‌. డ‌జ్ సైజ్ మ్యాట‌ర్ అంటూ కొన్ని రోజుల కింద‌టే దీని ప్రి లుక్‌తో ఆస‌క్తి రేకెత్తించారు. ఇప్పుడు టైటిల్‌తో పాటు ఫ‌‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. అప్పుడు కానీ ఇందులో సంతోష్ శోభ‌న్ హీరో అని తెలియ‌లేదు.

ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్ అనుబంధ సంస్థ నిర్మిస్తుండ‌టం విశేషం. యువ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ అందిస్తే.. కార్తీక్ రాపోలు అనే కొత్త డైరెక్ట‌ర్ దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శోభ‌న్ చ‌నిపోయి చాలా ఏళ్ల‌యినా.. అత‌డికి ఇండ‌స్ట్రీలో చాలా మంచి పేరుంది. ఆ పేరే సంతోష్‌కు అవ‌కాశాలు ఇపిస్తున్న‌ట్లుంది. మ‌రి ఈసారైనా అత‌ను మంచి విజ‌యాన్నందుకుని ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ‌తాడేమో చూడాలి.