చ‌ప్పుడు లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు స‌ర్ప్రైజా, షాకా?

ntr

ఓ వైపు డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రోవైపు తాము కోరుకుంటున్న అప్ డేట్ విష‌యంలో ఏ చ‌ప్పుడూ లేదు. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నెల 20న తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి అత‌డికి, అభిమానుల‌కు కానుక ఉంటుందా లేదా అనే విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. మార్చి నెలాఖ‌ర్లో రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా తార‌క్ వాయిస్ ఓవ‌ర్‌తో రిలీజ్ చేసిన వీడియో ఎంత బాగా పేలిందో తెలిసిందే.

అదే స్థాయిలో జూనియ‌ర్ పుట్టిన రోజుకూ వీడియో త‌ప్ప‌క ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ కంటెంట్ పేప‌ర్ మీద రెడీగా ఉన్నా.. చిత్రీక‌ర‌ణ‌కు అవ‌కాశం లేక‌పోవ‌డంతో తార‌క్ పుట్టిన రోజుకు స్పెష‌ల్ వీడియో ఉంటుందో లేదో చెప్ప‌లేమ‌ని రాజ‌మౌళి ఇంత‌కుముందు సందేహాలు వ్య‌క్తం చేశాడు. అలాగ‌ని అస‌లేమీ ఉండ‌ద‌ని కొట్టిపారేయ‌నూ లేదు. ఇది త‌మ‌కు స‌వాలే అని.. ఏం చేస్తామో చూడాల‌ని అన్నాడు.

ఐతే అభిమానుల్లో అంచ‌నాలు త‌గ్గించ‌డానికి, రామ్ చ‌ర‌ణ్ వీడియో స్థాయిలో తార‌క్ ఏవీని చేయ‌డానికి అవ‌కాశం లేద‌ని చెప్ప‌డానికి రాజ‌మౌళి ఇలా డౌట్లు క్రియేట్ చేశాడేమో అనుకుంటున్నారు. తార‌క్ మీద జ‌క్క‌న్న‌కున్న ప్ర‌త్యేక అభిమానం తెలిసిందే కాబ‌ట్టి ఏదో ఒక విశేషాన్ని అయితే రెడీ చేయ‌కుండా ఉండ‌డ‌నే భావిస్తున్నారు. మ‌రి అదేంట‌న్న విష‌యంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఒక ద‌శ‌లో వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలిచ్చిన జ‌క్క‌న్న‌.. గ‌త ప‌ది రోజులుగా సైలెంటుగా ఉన్నాడు. తార‌క్ వీడియోకు సంబంధించి అస‌లే విధ‌మైన సౌండ్ లేదు. పుట్టిన రోజుకు ఇంకో ప‌ది రోజులే వ్య‌వ‌ధి ఉండ‌గా.. ఆ రోజుకు ఏమీ లేకుండా జ‌క్క‌న్న షాక్ ఇస్తాడా.. లేక ఏదో ఒక విశేషంతో స‌ర్ప్రైజ్ చేస్తాడా అన్న‌ది చూడాలి.