బాహుబలి మూవీతో ఉత్తరాదిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన దగ్గర డిజాస్టర్ అనిపించుకున్న సాహో.. నార్త్‌లో హిట్ స్టేటస్ అందుకుందంటే అక్కడ అతడికి ఏ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చిందో, తనను అక్కడి ప్రేక్షకులు ఎలా నెత్తిన పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. డిజాస్టర్ టాక్‌తోనూ ఈ సినిమా హిందీలో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
ఇది చూసే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి తహతహలాడుతున్నారు. అతడి ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతోంది. ఆదిపురుష్‌తో అతను నేరుగా హిందీలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలూ అక్కడి వాళ్లే. ఒక రకంగా చెప్పాలంటే అది హిందీలో తెరకెక్కి తెలుగులోకి అనువాదం కానున్న సినిమా అని చెప్పొచ్చు.
ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. దాని కోసం కొన్ని నెలల పాటు ప్రభాస్ ముంబయిలో ఉండాల్సి వస్తుంది. ప్రభాస్ చేస్తున్న, చేయబోయే సినిమాలకు కూడా పాన్ ఇండియా అప్పీల్ రావడం కోసం ముంబయిలో చిత్రీకరణ జరిపే అవకాశముంది. తరచుగా అతను బాలీవుడ్ సినీ స్థావరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ముంబయిలో ఓ భారీ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్‌తో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నాడట. ప్రభాస్‌కు ఇల్లు చూసే బాధ్యత ఆయనే తీసుకున్నాడట.
ఎలాగూ ఒక పెట్టుబడిగా కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ప్రభాస్ చూస్తున్నట్లు సమాచారం. పదుల కోట్ల మొత్తంలోనే ఇందుకోసం పెట్టుబడి పెడుతున్నాడట. బహుశా ఆదిపురుష్ సినిమాకు వచ్చే పారితోషకమంతా ఇంటి మీదే పెట్టేస్తున్నాడేమో ప్రభాస్.