బాబాయ్ కోసం రానా త్యాగం?

విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘నారప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో చిత్ర బృందం కొంచెం తొందరపడింది. ‘ఆచార్య’ ఆల్రెడీ మే రెండో వారానికి ఫిక్సయిందని తెలిసో తెలియదో కానీ.. హడావుడిగా మే 14న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని గంటల్లోనే ‘ఆచార్య’ టీం లైన్లోకి వచ్చి తమ చిత్రం ఆ నెల 13న రానున్నట్లు ప్రకటించింది.

ఒకప్పుడైతే చిరు-వెంకీ మధ్య రసవత్తర బాక్సాఫీస్ సమరాలు నడిచేవి. కానీ ఇప్పుడు వెంకీ రేంజ్ తగ్గింది. భారీ అంచనాలున్న ‘ఆచార్య’ సినిమాకు పోటీగా ‘నారప్ప’ను నిలిపే పరిస్థితుల్లో వెంకీ లేడు. దీంతో డేట్ మార్చుకోక తప్పని పరిస్థితి. కానీ ముందు, వెనుక డేట్లన్నీ ఆల్రెడీ ప్యాక్ అయిపోయాయి. డేట్ మార్చుకుందామంటే ఎక్కడా ఖాళీ కనిపించడం లేదు. అలాగని ‘ఆచార్య’కు పోటీ వెళ్లడమన్నా కష్టమే. ఐతే ఈ సినిమా ఇప్పటికే ఆలస్యం అయిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడం కోసం రానా దగ్గుబాటి త్యాగం చేయనున్నట్లు సమాచారం.

రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30కి ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఆ తేదీన ‘నారప్ప’ రాబోతున్నట్లు తాజా సమాచారం. ‘విరాటపర్వం’ పని ఇంకా చాలా మిగిలుంది. అది కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. పైగా రానా దీని కంటే ముందు చేసిన ‘అరణ్య’ మార్చి 26న రాబోతోంది. అది వచ్చిన నెలకే తన మరో సినిమా రిలీజ్ చేయడం ఎందుకులే అని రానా ఆలోచిస్తున్నాడట. తన సినిమాను జూన్‌లో కుదిరిన డేటుకు రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యాడట.

అందుకే ఈ మధ్య ‘విరాటపర్వం’ పోస్టర్ల మీద ముందులాగా ఏప్రిల్ 30న రిలీజ్ అని వేయట్లేదని సమాచారం. నారప్ప, విరాటపర్వం చిత్రాలు రెండింట్లోనూ రానా తండ్రి సురేష్ బాబు నిర్మాణ భాగస్వామి కాబట్టి రిలీజ్ డేట్లను అడ్జస్ట్ చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది లేకపోయింది. ‘నారప్ప’ తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటించింది.