న‌రేష్ క‌థ రెడీ చేస్కో సినిమా తీస్తా- దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు హీరో అల్ల‌రి న‌రేష్‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చాడు. అత‌ను మంచి క‌థ రెడీ చేసుకుని వ‌స్తే తాను అత‌డితో సినిమా నిర్మిస్తాన‌ని హామీ ఇచ్చాడు. ఇది నాంది చిత్ర అభినంద‌న స‌భ‌లో ఇచ్చిన హామీ కావ‌డం విశేషం. ఈ అభినంద‌న స‌భ ఏర్పాటు చేసింది కూడా దిల్ రాజే.

నాంది సినిమాతో త‌న‌కే సంబంధం లేద‌ని.. ప్రొడ‌క్ష‌న్లో కానీ, డిస్ట్రిబ్యూష‌న్లో కానీ తాను భాగ‌స్వామిని కాద‌ని.. ఐతే ఈ సినిమా గురించి అంద‌రూ మంచి మాట‌లు చెబుతుండ‌టం, మంచి రివ్యూలు రావ‌డం చూసి సినిమా చూశాన‌ని.. ఇది చాలా మంచి సినిమా అనిపించి, ఇలాంటి సినిమాను త‌న వంతు బాధ్య‌త‌గా ప్ర‌మోట్ చేయాల‌ని, చిత్ర బృందాన్ని అభినందించాల‌ని అనిపించి చొర‌వ తీసుకుని ఈ అభినంద‌న స‌భ ఏర్పాటు చేయించిన‌ట్లు రాజు వెల్ల‌డించాడు. ఈ ఏడాది త‌న సినిమాలు ఏడెనిమ‌ది దాకా ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయ‌ని.. వాటి కోస‌మే చాలాసార్లు మీడియాను క‌ల‌వాల్సి ఉంటుంద‌ని, కాబ‌ట్టి వేరే సినిమాల వేడుక‌ల‌కు వెళ్లొద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్న తాను.. నాంది టీం పిల‌వ‌క‌పోయినా త‌నే వాళ్ల‌ను పిలిచి ఈ స‌భ ఏర్పాటు చేశాన‌న్నాడు.

ఈ సినిమాతో అంద‌రూ చాలా సంతోషంగా ఉన్నార‌ని, డిస్ట్రిబ్యూట‌ర్లంద‌రూ లాభాలు అందుకుంటున్నార‌ని, ఇలాంటి మంచి సినిమాలు ఆడాల్సిన అవ‌స‌రం చాలా ఉంద‌ని, ప్రేక్ష‌కులు మ‌రింత‌గా ఈ సినిమా చూసి ప్రోత్స‌హించాల‌ని రాజు అభిల‌షించాడు. తాను కింద కూర్చున్న‌పుడు త‌న‌తో ఎప్పుడు సినిమా తీస్తార‌ని న‌రేష్ అడిగాడ‌ని.. ఇప్పుడు స‌భాముఖంగా చెబుతున్నాన‌ని, అత‌ను క‌థ రెడీ చేసుకుని వ‌స్తే వెంట‌నే త‌న బేన‌ర్లో సినిమా తీస్తాన‌ని రాజు హామీ ఇచ్చాడు.

నాంది సినిమా ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల త‌న బేన‌ర్లో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడ‌ని, కానీ నాంది క‌థ చెప్ప‌డం కానీ, ఆ సినిమా చూపించ‌డం మాత్రం చేయ‌లేద‌ని, సినిమా బాగుంటే త‌నే చూసి అభినందిస్తాన‌న్న‌ది అత‌డి ఆత్మ‌విశ్వాసం కావ‌చ్చ‌ని రాజు చెప్పాడు.